() ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు() కేంద్ర కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు() పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలుహైదరాబాద్) దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం మరింతగా పనిచేస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. త్వరలోనే అన్నీ మంచిరోజులు ఉంటాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆయన జెండా ఎగురవేశారు.ఘనంగా వేడుకలులోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామక్రిష్ణారెడ్డి, రోజా, కోన రఘుపతి, కొల్లి నిర్మల, చల్లా మధుసూదన్, నల్లా సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. భారీగా రూపొందించిన కేక్ ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంచారు. అనంతరం సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అంధులైన అనాథ పిల్లలకు స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు ఉచితంగా అందచేశారు. నిరుపేద మహిళలకు చీరెలు పంచారు. త్వరలోనే మంచి రోజులు ఏపీలో ఇపుడున్న పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు హేయమైన భావాలు కలిగిస్తున్నాయని ఈ సందర్భంగా మేకపాటి మండిపడ్డారు. మహత్తరమైన కార్యక్రమం అంటూ దాంట్లో కూడా సొంత లాభం చూసుకుంటున్నారని, కాకపోతే ఈ విషయంలో మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని మేకపాటి చెప్పారు. మనమెప్పుడూ పొరపాటుగా మాట్లాడకూడదు, పనులు చేయకూడదని సూచించారు. చంద్రబాబు తాను చేస్తున్న కార్యక్రమాల గురించి పైకి చాలా గొప్పగా చెబుతారని, ఆయన్ను చూసే ప్రపంచమంతా క్యారెక్టర్ నేర్చుకోవాలన్నట్లు ఉంటాయని.. నీతివాక్యాలు చెబుతారు గానీ ఆచరణకు మాత్రం దూరంగా ఉంటారని తెలిపారు.ఆయన చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే చాలు.. పార్టీకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సాధారణంగా 2019 ఎన్నికలంటే 2018లో ప్రజలకు ఉత్సాహం వస్తుందని, కానీ ఇప్పుడు 2016లోనే అలాంటి పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ప్రజలు మన పార్టీకి నాయకత్వం అప్పగించే అవకాశం స్పష్టంగా ఉందని, ఇలాంటి సమయంలో మనం చిన్న పొరపాటు చేసి కూడా అలాంటి అవకాశాలను వదులకోకూడదని చెప్పారు. కొంతమంది సొంత కారణాల వల్ల వెళ్లినా, వాళ్లు విచారించే పరిస్థితులు వెంటనే వచ్చాయని గుర్తుచేశారు. వాళ్లు వెళ్లడం వల్ల ఈ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే.. ప్రజల్లో మనకు గౌరవం ఉండదని, రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారని తెలిపారు. రాజధాని నూజివీడు దగ్గర అన్నారు, నాగార్జున యూనివర్సిటీ అన్నారు.. చివరకు ముందు భూములు కొనేసి తర్వాత ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆయనకు ఉన్నదే క్యారెక్టర్ అని చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులా అని ప్రశ్నించారు. ఉదయించే సూర్యుడుపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల పునాది మీద ఆరంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు పూర్తి చేసుకుందని ఆమె అన్నారు. రాజన్న పాలనను అందించేందుకు ముందుకొచ్చిన పార్టీ ఇదని, ఇలాంటి పార్టీలో కార్యకర్తగా, ఎమ్మెల్యేగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నామని అన్నారు. దేశ రాజకీయాల్లోనే ఈ పార్టీకి అరుదైన చరిత్ర ఉందని, పార్టీ పెట్టిన వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లి కనీ వినీ ఎరుగని మెజారిటీ సాధించి, తెలుగోడి సత్తా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా చేసిన పార్టీ ఇదని ఆమె అన్నారు. ప్రజల కోసం, రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్న పార్టీ ఇదని, దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. తమ నాయకుడు ఓటుకు కోట్లిచ్చిన అవినీతిపరుడు కాడని, తోడేళ్ల లాంటి టీడీపీ వాళ్లు ఎంత బురద జల్లినా, తొడగొట్టి పోరాడుతున్న యోధుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు.