నిరుపేదల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం

విశాఖపట్నం :

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి కిరణ్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. నిరుపేదలకు కూడా ఖరీదైన వైద్యానికి అర్హుడే అని వారికి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అలాంటి వైద్యాన్ని ఉచితంగా అందించాలని వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని ఆమె వివరించారు. అయితే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆరోగ్యశ్రీ పథకంతో పాటు వైయస్‌ఆర్ హయాంలో పేదల కోసం నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను కూడా ప్రభుత్వం నీరుగార్చిందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వానికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదని మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విశాఖపట్నంలోని తూర్పు నియోజకవర్గంలో శనివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో భాగంగా ఆమె జాతీయ రహదారిపై ఉన్న విమ్సు వద్దకు చేరుకునేసరికి స్థానికులు ఆమెను కలిసి విమ్సు సమస్యలను చెప్పారు.

వైయస్ మర‌ణించాక విమ్సును వదిలేశారు :
‘నిమ్సు తరహాలో ఉత్తరాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.250 కోట్ల అంచనాతో 2007 జనవరిలో విమ్సు (విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆ‌ఫ్ మెడిక‌ల్ సెన్సై‌స్)కు శంకుస్థాపన చేశారు. 2010 డిసెంబరు‌ నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. తొలి విడతలో భవన నిర్మాణానికి రూ.55 కోట్ల నిధులు కేటాయించారు. తొలి దశలో 450 పడకలు, 6 సూపర్ స్పెషాలిటీ విభాగా‌లను అందుబాటులోకి తీసుకురావాలని, మొత్తం 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో మెరుగైన వైద్యసేవ‌లు అందించాలని నిర్ణయించారు. అయితే, ఆ మహానేత మరణం తర్వాత ఈ ప్రభుత్వం విమ్సును పూర్తిగా పక్కకు నెట్టేసింది’ అని స్థానికులు శ్రీమతి షర్మిలకు తెలిపారు.

వైయస్‌ పేరు తుడిచేసేందుకే ..:
వైయస్‌ఆర్ మర‌ణించాక రోశయ్య ఈ ఆస్పత్రిని తన అల్లుడికి కట్టబెట్టాలనుకున్నారని స్థానికులు చెప్పారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక టిడిపి ఎం.పి.కి చెందిన గీతం యూనివర్సిటీకి అప్పగించేందుకు ప్రయత్నించారన్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళనకు దిగితే ఆ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకుందని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సంవత్సరం క్రితం విశాఖలో పర్యటించినపుడు విమ్సుకు రూ.65 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికి రూ.15 కోట్లు మాత్రమే విదిల్చారని వారు వివరించారు. విమ్సు పూర్తయితే వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఆ ఘనత ఎక్కడ దక్కుతుందోనన్న అక్కసుతోనే ఇలా చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే వేయిమందికి పైగానే ఉపాధి దొరుకుతుందని, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో లక్షల మందికి మెరుగైన వైద్యసేవలు అందుతాయని వారు శ్రీమతి షర్మిలకు విన్నవించారు.

మరికొద్ది నెలలు ఓపిక పట్టండి :
స్థానికుల సమస్యలు విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. ‘మరి కొద్ది మాసాలు ఆగండన్నా.. జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. వైయస్‌ఆర్ హయాంలో ప్రారంభించి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటారు. జగనన్నతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’ అని భరోసా ఇచ్చారు.

శనివారంనాడు 14.1 కిలోమీటర్ల పాదయాత్ర :
‘మరో ప్రజాప్రస్థానం’ 201వ రోజు శనివారంనాడు శ్రీమతి షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కిర్లంపూడి లే అవుట్ బీ‌చ్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడ వైయస్‌ఆర్ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళు‌లు అర్పించారు. చినవాల్తేరు, పెదవాల్తేరు, ఉషోదయ కూడలి, ఏఎస్ రాజా మైదానం, ఎం‌.వి.పి. డబుల్ రో‌డ్, ఇసుకతోట, హనుమంతవాక, డెయిరీఫా‌మ్, ఆదర్శనగ‌ర్, రవీంద్రనగ‌ర్, తోటగరువు, బాలాజీనగ‌ర్, అంబేద్క‌ర్ కూడలి, దుర్గాబజా‌ర్, ఆరిలోవ ‌ఆఖరి బస్టా‌ప్, ముడసర్లోవ జలాశయం మీదుగా పాదయాత్ర చేశారు. రామకృష్ణాపురం వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. శనివారంనాడు శ్రీమతి షర్మిల ఆమె మొత్తం 14.1 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. శనివారం పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి మొత్తం 2,678.9 కిలోమీటర్లు శ్రీమతి షర్మిల నడిచారు.

Back to Top