బ్రాహ్మణోత్తముడిని కించపరిచారు..మూల్యం తప్పదు

  • మీ తప్పులను ఎత్తిచూపిస్తే గొంతు నొక్కేస్తారా..?
  • పేద బ్రాహ్మణులకు న్యాయం చేయాలనే ఐవీఆర్‌ తపన 
  • జన్మభూమి కమిటీలను వ్యతిరేకించినందుకు తప్పిస్తారా..?
  • ప్రభుత్వ వ్యతిరేక విధానాల పోస్టులను షేర్‌ చేసినందుకు తొలగిస్తారా..?
  • నోటీసులు ఇవ్వకుండా ఐవైఆర్‌ను అవమానపర్చిన చంద్రబాబు
  • కార్పొరేషన్లను మీ కార్యకర్తల తయారీ కర్మాగారాలుగా వాడుకోవద్దు
  • చంద్రబాబుకు అంబటి రాంబాబు హెచ్చరిక
గుంటూరు: నిజాయితీ గల ఐఏఎస్‌ అధికారి, బ్రాహ్మణోత్తముడు ఐవైఆర్‌ కృష్ణారావును అవమానపర్చిన సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగించిన విధానం కేవలం ఆ సామాజిక వర్గమే కాకుండా ప్రజాస్వామ్యంలోని సభ్యసమాజమంతా బాధపడాల్సిన రోజు అన్నారు. చంద్రబాబు నియంత పరిపాలన తీరుపై అంబటి మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఐవైఆర్‌ రాజకీయ నేత కాదు.. 30 ఏళ్లకు పైగా ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన వ్యక్తి అన్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుంటేనో.. లేక లోకేష్‌ను బతిమిలాడితేనో వచ్చిన పదవి కాదని స్పష్టం చేశారు. ముక్కుసూటిగా, నీతి, నిజాయితీతో వ్యవహరించే అధికారి అని, ప్రతిష్టాత్మక టీటీడీకి చైర్మన్‌గా పనిచేశారని, ఆయనతో నాకు కొంత పరిచయం ఉందని అంబటి చెప్పారు. రిటైర్డ్‌ అయిన తరువాత చాలా పదువులు ఇస్తామని చంద్రబాబు ఆశచూపారని ఐవైఆర్‌ మాటల ద్వారా విన్నామన్నారు. కానీ తాను పుట్టిన బ్రాహ్మణ కులానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ సామాజిక వర్గ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారన్నారు. 

జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ నిధులు వక్రమార్గం
ఐవైఆర్‌ కృష్ణారావు అనే నిజాయితీ గల అధికారి టీడీపీ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించలేదనే కక్షకట్టి తొలగించారనేది స్పష్టంగా అర్థం అవుతోందని అంబటి అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తే ఆ కులాన్నంతా తన భూజాలపై పెడతారని చంద్రబాబు భ్రమించివుంటారని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా చేర్చుకోవాలనే ఆచారాన్ని కృష్ణారావు వ్యతిరేకించారన్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ దండే బదిలీపై వెళ్తున్న సమయంలో ప్రభుత్వ రూల్స్‌ ప్రకారం.. పేదవారికి మేం సహాయం చేయలేకపోతున్నామని చెప్పారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ నిధులను వక్రమార్గం పట్టించి కేవలం తెలుగుదేశం పార్టీ నేతలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారనేది ఐవైఆర్‌ సంఘటన ఒక ఉదాహరణ అన్నారు. 

బాబు మానసిక పరిస్థితిపై అనుమానాలు
చంద్రబాబును ఎవరు వ్యతిరేకించినా సొంత పార్టీ నేతలనైతే తొక్కేస్తున్నారు.. అధికారులు, ఇతర పార్టీ నేతలనైతే తొలగించడం, కేసులు పెట్టించడం వంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. ఐవైఆర్‌ కృష్ణారావుకు నోటీసులు ఇవ్వకుండా తొలగించారంటే చంద్రబాబకు పోయేకాలం దాపరించిందని అర్థమైనట్లుందని విమర్శించారు. రాజీనామా అడిగివుంటే పారేశేవాడినని, ఎందుకు వీళ్లు ఇంత కంగారు పడి తొలగించారని ఐవైఆర్‌ అన్నారన్నారు. టీడీపీ దళిత ఎంపీ శివప్రసాద్‌ను కూడా చంద్రబాబు అవమానపరిచారని, టీడీపీ ఎంపీకే ఆరు నెలలుగా సీఎం అపాయింట్‌మెంటే దొరకలేదన్నారు. లేదా ఎవరికైనా టైమ్‌ ఇస్తే గంటల తరబడి సోది చెప్పి చంచేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. బహుశా చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లుగా అనిపిస్తోందన్నారు. 

భజన చేసేవారే కార్పొరేషన్ల చైర్మన్లు
కాపు కార్పొరేషన్‌లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆ సామాజిక వర్గ పెద్ద ముద్రగడ పద్మనాభం అన్నారని అంబటి గుర్తు చేశారు. చంద్రబాబు భజన చేసే వారికి కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా నియమిస్తున్నారన్నారు. ఎవరైతే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారో.. వాటిని సరిచేసుకొని సక్రమంగా నడపాల్సిన చంద్రబాబు వారి గొంతు నొక్కేస్తూ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మణ, కాపు ఏ కార్పొరేషన్‌ అయినా.. టీడీపీ కార్యకర్తలకు పనికొచ్చేది కాదు.. కాకూడదని, ఆయా కులాల్లోని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కేవలం మీ పార్టీ కార్యకర్తలను తయారు చేసే కర్మాగారాలుగా ఉండకూడదన్నారు.  బాలకృష్ణ సినిమాకు ఎందుకు రాయితీలు ఇచ్చారు. మీ బావమరిది గొప్పగా నటిస్తే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వడం... మీరు వివక్షతో పనిచేస్తున్నాని ఐవైఆర్‌ పోస్టులు షేర్‌ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ఐవైఆర్‌ను అవమానపర్చిన చంద్రబాబు ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top