కుట్రలను తట్టుకునే శక్తి దేవుడే జగన్‌కు ఇచ్చాడు

హైదరాబాద్ :

కుట్రలు, ఇతరులను ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా చేసే కుటిల రాజకీయాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా తట్టుకుని నిలబడాలనే శక్తిని ఆ దేవుడే జగన్‌బాబుకు నేర్పించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తెలిపారు. శ్రీ జగన్‌కు కష్టపడే మనస్తత్వం, దృఢ సంకల్పం, నిగ్రహ శక్తితో అనుకున్నది సాధించే గుణాలు సహజంగానే ఉన్నాయన్నారు. 16 నెలల జైలు జీవితాన్ని శిక్షగా కాకుండా రాజకీయ శిక్షణగా జగన్‌బాబు భావిస్తున్నారని ఆమె చెప్పారు. హైదరాబాద్‌ నగర శివారులోని మణికొండ ‘ది లైఫ్’ చర్చిలో ఆదివారం శ్రీమతి విజయమ్మ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె కాసేపు మీడియాతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి రాజకీయాల్లో కావాల్సిన అనుభవాన్ని ఇచ్చేందుకే దేవుడు ఈ విధంగా చేశాడని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రాజకీయాల్లో తన వారెవరు, కానిదెవరనే విషయం శ్రీ జగన్‌కు గత మూడేళ్ల అనుభవంలో తెలిసిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణించినపుడే జగ‌న్‌బాబు ముఖ్యమంత్రి అయి ఉంటే ఎవరేమిటనే విషయం అంతగా తెలిసే అవకాశం ఉండేది కాదన్నారు. శ్రీ జగన్‌పై మోపిన నింద, జరిగిన అవమానాల నుంచి దేవుడే బయటకు తెస్తాడని శ్రీమతి విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు.

నీతి, నిజాయితీ గల వ్యక్తులకు ఇలాంటి ఇబ్బందులు సహజమేనని, వాటిని ఎదుర్కొనే సత్తా శ్రీ జగన్‌లో ఉందని కుండబద్దలు కొట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె శ్రీమతి షర్మిల ఎండలో వానలో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర చేయటం తనను ఎంతగానో బాధించిందన్నారు. శ్రీమతి విజయమ్మతో పాటు మనవరాళ్లు, ‌మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ సోదరి విమలమ్మ తదితరులు‌ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Back to Top