టీడీపీ మహానాడులో పరనింద.. సొంత డబ్బా

హైదరాబాద్:

టీడీపీ మహానాడు జరుగుతున్న తీరు సొంత డబ్బా కొట్టుకుంటూ.. పరనిందలా చేసేలా కొనసాగుతోందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజల ఆశలకు అనుగుణంగా, హామీలకు భరోసా ఇచ్చే విధంగా తీర్మానాలు ఉంటాయనుకున్న వారి ఆశలను టీడీపీ వమ్ము చేస్తోందన్నారు. రాబోయే కాలాన్ని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది తప్ప, పరిపాలన సాగించే దమ్మున్న నాయకుడిగా లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక ముందే టీడీపీ కార్యకర్తలను మోసం చేసే చర్యలకు చంద్రబాబు దిగుతున్నారని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నాలుగు రకాల కార్యక్రమాలకు సిద్ధపడినట్లుగా కనిపిస్తోందన్నారు. ‘టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టడం, ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే దుర్బుద్ధి, తన నిజస్వరూపం బయటపడకుండా మోడీ ముసుగును కొనసాగించడం, హామీలకు తూట్లు పొడిచే బీద అరుపులు అరవడం’ వంటి నాలుగు రకాల కార్యక్రమాలను చంద్రబాబు ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నారు.

‘ప్రత్యర్థుల మీద టీడీపీకి కక్షసాధింపు ఉండదని, మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభం కాగానే టీడీపీ కార్యకర్తల హత్యలకు పురిగొల్పారంటూ ద్వేషాన్ని నింపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. వైయస్ఆర్ పరిపాలన కేవలం టీడీపీ కార్యకర్తలను చంపడానికి ప్రారంభించారనడాన్ని.. ఆ పార్టీ కార్యకర్తలు మననం చేసుకోవాల’ని అన్నారు.

Back to Top