వైయ‌స్ జ‌గ‌న్‌పై దాడి ఘటన విని.. గుండె ఆగి..

 

 

ప్రకాశం జిల్లాలో ఓ అభిమాని మృతి

టీవీలో వార్తలు చూస్తూ కుప్పకూలిన వైనం

గుంటూరు జిల్లాలో చేతులు కోసుకున్న యువకుడు

మనోవేదనతో అస్వస్థతకు గురైన మాజీ సర్పంచ్‌

 నూజివీడు: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందనే వార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక నేతలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. చినగంజాం మండలం పెదగంజాం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల సుబ్బారావు (60) వ్యవసాయ కూలీగా జీవనం గడుపుతున్నాడు. గురువారం కూలి పనికి వెళ్లిన సుబ్బారావు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తున్న సమయంలో వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి జరిగిందనే వార్తలు ప్రసారం అవుతున్నాయి. అవి చూస్తుండగా అకస్మాత్తుగా గుండె ఆగి అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అతని మృతి పట్ల స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సంతాపం, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 



వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నాన్ని జీర్ణించుకోలేక..
తన అభిమాన నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని జీర్ణించుకోలేక శుక్రవారం ఓ యువకుడు గుంటూరు జిల్లా కారంపూడిలో చేతులు కోసుకున్నాడు. ఆ సమయంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశాడు. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. యువకుడు చేతులు కోసుకోవడాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ నేతలు కొంగర సుబ్రమణ్యం, షేక్‌ అక్బర్, తిరుపతిరెడ్డి తదితరులు అతన్ని అడ్డుకుని అక్కడి నుంచి పంపివేశారు.  

అస్వస్థతకు గురైన మాజీ సర్పంచ్‌కు 
జగన్‌పై హత్యాయత్నంతో ఆందోళన చెంది కృష్ణా జిల్లా ముసునూరు మాజీ సర్పంచ్, వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్‌ నేత రేగుల గోపాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వార్త తెలిసినప్పటి నుంచి ఆయన మనోవ్యధకు లోనయ్యారు. గురువారం రాత్రి పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా, కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 10గంటల సమయంలో టీవీలో వార్తలు చూస్తూ గుండెపోటుకు గురయ్యారు. బంధువులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, అధికారులు, బంధువులు, మిత్రులు ఆకాంక్షించారు. 



Back to Top