'ఎఫ్‌డిఐతో రైతులు, వ్యాపారులకు పెను ముప్పు'

న్యూఢిల్లీ: మన దేశంలోని కోట్లాదిమంది రైతులు, వ్యాపారుల భవిష్యత్తును రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) దెబ్బతీస్తాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌డిఐలను అనుమతిస్తే కోట్లాది మంది చిన్న వ్యాపారులు, రైతుల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దేశంలోకి రిటైల్ రంగంలో ఎ‌ఫ్‌డిఐని అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ ఎంతమాత్రం సమర్థించబోదని ఆయన స్పష్టం చేశారు. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో మేకపాటి పాల్గొన్నారు.

సమయం లేని కారణంగా అనేక ఇతర పార్టీలతో పాటు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌కు చర్చలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం దొరకలేదు. అయితే వక్తల జాబితాలో అవకాశం ఇచ్చిన వారంతా తమ ప్రసంగాలను సభకు సమర్పించాలని, వాటన్నింటినీ సభలో చేసిన ప్రసంగాలుగానే పరిగణిస్తామని లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్ ‌తెలిపారు. దీనితో ఇతర పార్టీల ఎంపీలతో పాటు మేకపాటి కూడా తన ప్రసంగాన్ని సభకు సమర్పించారు.

రిటైల్‌ ఎఫ్‌డిఐ అంటే కోట్లాది మంది ఉపాధితో ముడిపడిన అంశమని, ఈ విధానాన్ని ప్రకటించే ముందు దేశ ప్రజల ఆందోళలన్నింటినీ కేంద్రప్రభుత్వం తొలగించాల్సిందన్నారు. తయారీ, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాల రంగాల్లో ఎ‌ఫ్‌డిఐలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని తాము స్వాగతిస్తామన్నారు. ఎఫ్‌డిఐ అమలైతే దేశంలో గుత్తాధిపత్య ప్రమాదం ముంచుకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top