'ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ వైపే జనం'

కొత్తకోట టౌన్ (మహబూబ్ నగర్ జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమంగా జైలులో ఉంచారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలతో శ్రీ జగన్మోహనరెడ్డిని నిర్బంధించారని అన్నారు. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా జనం కోసం వాటిని తొలగించుకొని నిర్ధోషిగా బయటికి వస్తారన్నారు.

     'జగన్ కోసం...  జనం సంతకం'లో భాగంగా ఆదివారం కొత్తకోటలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రావుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ జగన్మోహనరెడ్డి అధికార పార్టీతో విభేదించి రాజకీయ పార్టీ పెట్టినందుకే వేధిస్తున్నారని అన్నారు. దర్యాప్తు పేరుతో 200 రోజులకు పైగా అక్రమంగా నిర్భందంలో ఉంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

     శ్రీ జగన్మోహనరెడ్డిపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని, ప్రజా వ్యవస్థలో ప్రజల హక్కులను కాపాడాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జోక్యం చేసుకోవాలని రావుల కోరారు. శ్రీ జగన్మోహనరెడ్డికి బెయిల్ రాకుండా ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజల అండదండలు కలిగిన శ్రీ జగన్మోహనరెడ్డిని ఏ శక్తులు అడ్డుకోలేవన్నారు. ఇప్పటికైన ప్రజా మద్దతు కలిగిన శ్రీ జగన్మోహనరెడ్డిని రాజకీయ పార్టీ అధినేతగా గుర్తించి జైలు నుండి విముక్తి కలిగించాలన్నారు.

Back to Top