సీఎం రమేష్‌ చంద్రబాబు మొదటి బినామీ


రాజకీయ ప్రేరేపిత దాడులుగా మాట్లాడడం విడ్డూరం
చంద్రబాబు ఒత్తాసు పలుకుతూ పచ్చమీడియా ప్రచారం
ప్రకృతి విపత్తులకన్నా ఐటీ దాడులు భయకరమైనవా..? బాబూ
ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడూ పోటీ చేయని సీఎం రమేష్‌ మీసాలు మెలేయడం ఆశ్చర్యం
పచ్చకాలం కలకాలం ఉండదు.. బాబుకు బడిత పూజ గ్యారంటీ
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడ: ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న ఐటీదాడులతో చంద్రబాబు వెన్నులో వణుకు కనిపిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు, కాంట్రాక్టర్లుగా మారిన నేతలపై దాడులు జరుగుతున్నాయని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రేరేపిత దాడులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పచ్చ పత్రికలు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ రాజకీయ ప్రేరేపిత దాడులుగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒకవైపు తిత్లీ తుఫాన్‌ దాడులు బీభత్సం సృష్టిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాలకు వెళ్లి కూడా ఐటీ దాడుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రకృతి విపత్తుకన్నా.. ఐటీదాడులు చాలా భయంకరమైనవిగా మాట్లాడుతున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబులో భయం. వణుకు కనిపిస్తుంది. 

ఐటీ దాడుల గురించి రిత్విక్‌ కన్స్‌స్ట్రక్షన్‌ అధినేత, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మాట్లాడడం వింటుంటే.. గాడిదలు గర్జిస్తున్నాయి. నక్కలు గీంకరిస్తున్నాయి. తోడేళ్లు తొడలు కొడుతున్నాయి. పందికొక్కులు మీసాలు మెలేస్తున్నాయి అని ఎద్దేవా చేశారు. పచ్చకాలం పచ్చగడ్డి మేసి గాడిదలు గీంకరిస్తున్నాయని, చంద్రబాబు పండించిన పచ్చగడ్డిని మేసిన గాడిదలు గీంకరిస్తే ఎవరికైనా భయం వేస్తుందా.. అని ప్రశ్నించారు. సీఎం రమేష్‌ మీసాలు మెలేస్తే నవ్వొస్తుందన్నారు. సారా కాంట్రాక్టర్‌ చంద్రబాబుకు బీనామీగా మారి కోట్లు సంపాదించాడన్నారు. మీ చరిత్ర ఎవరికీ తెలియదనుకుంటున్నారా రమేష్‌ అని విరుచుకుపడ్డారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌గా గెలిచిన తరువాత ఈ డాదులు జరుగుతున్నాయని సీఎం రమేష్‌ మీసాలు మెలేస్తే చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రానికి, మీకు ఏం చేడిందో మీరే ఆలోచించుకోవాలని, అయినా ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించని సీఎం రమేష్‌ మీసాలు మెలేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంత వీరోచితంగా పోరాటం చేశాడో కడప ప్రజానీకం మొత్తానికి తెలుసన్నారు. 

సీఎం రమేష్‌ చంద్రబాబు నాయుడి మొదటి బినామీ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని కాంట్రాక్టులు సీఎం రమేష్‌ కంపెనీ దక్కించుకుందో చెప్పాలన్నారు. సబ్‌ కాంట్రాక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకొని కమీషన్లు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో సీఎం రమేష్‌ నువ్వు మీసం మెలేస్తావా..? అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులు జరుగుతాయని, మిగతా కంపెనీపై ఎందుకు దాడులు జరుగడం లేదో ఆలోచించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్‌ మాధవ అన్నారని, పార్టీ మారితే అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్పడం వింటుంటే ఆ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రబాబు దగ్గర ట్రైనింగ్‌ పొంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రమేష్‌ వేలిముద్రలు పెడితే తప్ప ఇంట్లో ఉన్న లాకర్‌ ఓపెన్‌ కాదంటే.. అంటే జీవిత భాగస్వామి, రక్తసంబంధికులకు తెలియనంత రహస్యం ఏముంటుందని, కచ్చితంగా చంద్రబాబుకు సంబంధించిన ఆస్తులు ఉండి ఉంటాయన్నారు. సీఎం రమేష్‌కు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదని, దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. పచ్చకాలం కలకాలం ఉండదని, చంద్రబాబుకు ఆయన పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, బడిత పూజ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top