చిల్లర వ్యాపారంపై బాబు చిల్లర రాజకీయం

గుంటూరు, 8 డిసెంబర్‌ 2012: దేశ చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లుపై‌ రాజ్యసభలో ఓటింగ్‌ సందర్భంగా ముగ్గురు టిడిపి సభ్యులు గైర్హాజరవడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుపట్టారు. ఇదంతా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయనను ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీతో ‌చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. శనివారంనాడు గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో కలిసి అంబటి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చీకటిలో బేరసారాలు ఆడుకుని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. దాని కంటే చిరంజీవిలా పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందాలని హితవు పలికారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా, దానికి ఎలాంటి నష్టమూ కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంబటి అన్నారు. దానికి ప్రతిగా తన మీద ఉన్న కేసులపై విచారణ చేయించకుండా కాంగ్రెస్‌ పార్టీ భరోసా ఇచ్చిందన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు టిడిపి సహకరించిన విషయం జనమెరిగిన సత్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీని‌‌ తమ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడినప్పటి నుంచి చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు నాయుడి‌ నిజస్వరూపం మరోసారి బయటపడిందని, ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేకి కాదని, కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిన వ్యక్తి అని విమర్శించారు.

ఎఫ్‌డీఐలకు ‌తాము వ్యతిరేకమని పార్టమెంటు ఉభయ సభలలో టిడిపి ప్రకటించిందని, కాని దానికి భిన్నంగా రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు గైర్హాజరై పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సహకరించడం ద్వారానే బిల్లు నెగ్గిందని ఆరోపించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌పార్టీకి మధ్య ఉన్న బంధాన్ని వైయస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందని స్పష్టం చేశారు. సోనియా, చంద్రబాబు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుతంత్రాలు పన్నినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజయాన్నిఅడ్డుకోలేరని అంబటి తెలిపారు.

పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి‌ రాజశేఖర్, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకట రమణ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.

Back to Top