పొదుపు చేద్దామంటూ బాబు దుబారా..!

సచివులు, అధికారులకు ఆయనే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం అనేక నీతులు చెబుతుంటారు. కానీ అవేవీ తాను పాటించడానికి మాత్రం కాదు. విభజన తర్వాత రాష్ర్టం కష్టాల్లో ఉందని, అందరూ పొదుపు పాటించాలని చంద్రబాబు గొప్పగొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు లేవని, ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఆయన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. ఇన్ని చెప్పే పెద్దమనిషి తాను మాత్రం పొదుపును పాటించాల్సిన పనిలేదా? స్టార్ హోటళ్లలో సమీక్షలు పెట్టవద్దని గతంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కానీ విజయవాడలో శుక్రవారం నాడు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓ ప్రయివేట్ ఫంక్షన్‌హాలులో సమీక్ష నిర్వహించారు. అందుకే అధికారులు, మంత్రులు అందరూ చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. చంద్రబాబు చెబుతారు గానీ ఆయనే పాటించరు కాబట్టి తామూ ఎలా నడుచుకున్నా ఫరవాలేదని వారంతా భావిస్తున్నారన్నమాట. డీవీమేనర్, గేట్‌వే, మురళీ ఫార్చూన్ వంటి స్టార్ హోటళ్లలోనే మంత్రులు, అధికారులు బస చేస్తున్నారు. మంత్రుల నుంచి కలెక్టర్ల వరకు అందరూ కాస్ట్‌లీ హోటళ్లలోనే బస చేస్తున్నారు. అంతేకాకుండా లంచ్, డిన్నర్లకు కూడా వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల్లో మాత్రమే తిరుగుతుండగా, మంత్రులు, ఐఎఎస్‌లు కూడా ప్రత్యేక సదుపాయాలున్న తరగతుల్లో మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు. ఒకవైపు విరాళాలు సేకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దుబారా చూసి జనం విస్తుపోతున్నారు.
Back to Top