నాడు స్టింగ్ను సమర్థించిన బాబు

నేడు ఎందుకీ పెడబొబ్బలు?
తివారీని రాజీనామా చేయమన్నారుగా..
అది మీకు వర్తించదా చంద్రబాబూ?

చిత్తశుద్ధితో ముందుకు రండి...
అవినీతిపై అందరం కలసి పోరాడదాం....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు తరచూ చెబుతుండే మాటలివి

చెప్పేందుకే నీతులు అని సామెత. కానీ ఇవేవీ తనకు వర్తించవన్నట్లు ఉంటుంది ఆయన తీరు. పరాయివారికే తప్ప ఆయన ఆచరించడానికి ఈ నీతులు పనికిరావన్న సంగతి అనేకమార్లు రుజువయ్యింది. అన్ని కుంభకోణాల్లో ఆయన ఉన్నారు మరి.

గతంలో 2009లో అప్పటి రాష్ర్ట గవర్నర్ ఎన్డీ తివారీ మీద ఏబీఎన్ చానెల్ రాజ్భవన్లో ఓ స్టింగ్ ఆపరేషన్ చేసింది. దానిని చంద్రబాబు చాలా సమర్థించారు. నైతిక విలువలకు కట్టుబడి గవర్నర్ తివారీ రాజీనామా చేయాలంటూ స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆయనపై యాక్షన్ తీసుకోవలసిందిగా కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడు ఆయనేమన్నారో చూడండి....

 ‘‘గవర్నర్ ఇన్సిడెంట్ కూడా చూశాం. చాలా బాధేస్తుంది. అది నిజమైతే ఇమ్మీడియేట్గా గవర్నర్ రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిది. లేకపోతే ఆయన్ని పదవి నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రజాజీవితంలో ముఖ్యంగా రాజ్భవన్లో ఇలాంటివి జరగడం చాలా బాధేస్తుంది. ఒకటే మార్గం. ఆయన ఇమ్మీడియేట్గా రాజీనామా చేయడం. లేకపోతే ఇమ్మీడియేట్గా ఆయన్ని అక్కడ్నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియేట్గా చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని డిమాండ్ చేస్తున్నా. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. దీనిపైన కూడా ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఈరోజు చూస్తుంటే చాలా సమాచారం వస్తోంది. ఎంపీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని.’’

అది 2009 నాటి సంగతి కదా... ఆరేళ్లయింది.. అందరూ మర్చిపోయి ఉంటారని చంద్రబాబు అనుకున్నారేమో. అందుకే ఇపుడు ఆయన జరిగిన నేరాన్ని వదిలేసి తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.  నాడు స్టింగ్ ఆపరేషన్ను సమర్థించి తివారీకి రాజీనామా చేయాలని ఉచిత సలహా ఇచ్చిన చంద్రబాబు మరి అడ్డంగా దొరికిపోయినా పదవిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నట్టు?

ఇపుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయల డబ్బు లంచంగా ఇవ్వజూపుతూ పట్టుబడ్డాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 5 కోట్ల రూపాయలను బాస్ ఓకే చేశారని, మిగిలిన 4.5 కోట్ల రూపాయలను కూడా తాము అందజేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం వీడియో టేపుల్లో ఉంది. తమవాళ్లు చెప్పినవన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు చెప్పడాన్ని కూడా దేశవ్యాప్తంగా అందరూ విన్నారు.

2009లో ఓ చానెల్ స్టింగ్ ఆపరేషన్ను నిస్సిగ్గుగా సమర్థించిన చంద్రబాబు నాయుడు ఇపుడు ఒక ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ వేసిన ట్రాప్ను తప్పుబడుతున్నారు. ఏపీ సీఎంనైన తన ఫోన్నే ట్యాపింగ్ చేస్తారా అంటూ హూంకరిస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకర్తలతో ఫేక్ ఫిర్యాదులు చేయించారు. వాటి దర్యాప్తు కోసం ఎస్పీ స్థాయి అధికారితో సిట్ నియమించారు. న్యాయపరిధిని పట్టించుకోకుండా విజయవాడకు టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను రప్పించి తమకు కాల్ డేటా ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేరంలో తాను, తమ ఎమ్మెల్యే ఇరుక్కుంటే దీన్నొక అంతర్రాష్ట్ర సమస్యలాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అనుకూలమైతే ఏమైనా చేయొచ్చు. తనకు ప్రతికూలమైతే అది రాజ్యాంగ విరుద్ధం. ఇదీ చంద్రబాబు నాయుడు రెండునాల్కల ధోరణి.
Back to Top