ఇకనైనా భూములు కొట్టేయడం మానుకో బాబూ

అమరావతి: చంద్రబాబు ఇకనైనా దేవాలయ భూములు కొట్టేయడం మానుకో అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల వేలంపాటలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద వేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రాజావాసిరెడ్డి ఇచ్చిన ఆస్తిని చంద్రబాబు తన తాబేదారులకు మూడో కంటికి తెలియకుండా కేటాయించాడని గుర్తు చేశారు. రూ. 12 వందల కోట్లు పలికే భూమిని కేవలం రూ. 22 కోట్లకే కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజయ కుటుంబంతో పాట పాడించారన్నారు. సదావర్తి భూములపై అక్రమాలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, కోర్టు తిరిగి తనతో రూ.27.5 కోట్లు కట్టించుకుందన్నారు. హైకోర్టు తీర్పును సహించలేని చంద్రబాబు సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేశారని, సుప్రీం కోర్టు కూడా చంద్రబాబుకు గట్టిగా బుద్ధివచ్చేలా వేలం నిర్వహించాలని తీర్పు ఇచ్చిందన్నారు. వేలంపాటలో వచ్చిన డబ్బును రాజావాసిదేవరెడ్డి కోరిక మేరకు ఉపయోగించాలని కోరుతున్నామన్నారు.

Back to Top