అంబేద్కర్‌ విగ్రహానికి దండేసే అర్హత బాబుకు లేదు

  • గుండెలేని వ్యక్తి ఎన్ని దండలేస్తే ఏంటి..?
  • ప్రపంచ దేశాలే కొనియాడదగ్గ వ్యక్తి అంబేద్కర్‌
  • చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్ర సృషించలేడు బాబూ
  • దళితులను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు
  •  రాజ్యాంగాన్ని కించపరుస్తూ విగ్రహాల ఏర్పాటా..?
  • అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున
హైదరాబాద్‌: దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ దళిత జాతిని కించపరచిన చంద్రబాబుకు... అంబేద్కర్‌ విగ్రహానికి దండ వేసే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. అంటరానితనానికి ఎదురొడ్డి ప్రపంచ దేశాలే కొనియాడదగ్గ వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. అలాంటి మహానుభావుడు ఆశయాలకు వ్యతిరేకంగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని మేరుగ మండిపడ్డారు. అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అంబేద్కర్‌ చెప్పిన కొన్ని సూక్తులను నాగార్జున గుర్తు చేసుకున్నారు. ‘‘చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్ర సృష్టించలేడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూడింటిని ప్రబోధించే మతాన్ని అభిమానిస్తానని, అదే ప్రజాస్వామ్యమతమని, అదే నా అభిమతం’’ అని అంబేద్కర్‌ చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎంత మంచిగా బతికామన్నది ముఖ్యం అని కూడా అంబేద్కర్‌ చెప్పారన్నారు. అంబేద్కర్‌ అంటే మనిషి కాదు మరణం లేని వ్యవస్థ అని కొనియాడారు. చనిపోయి 61 సంవత్సరాలు అయినా ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. అలాంటి మహానుభావుడి జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నామని పేర్కొన్నారు. 

బాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం
చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మేరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన ముఖ్యమంత్రి దానికి తూట్లు పొడుస్తూ కించపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి అంబేద్కర్‌ విగ్రహం పెట్టే కనీస అర్హత కూడా లేదన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే హృదయం నిండా ఆయన ఆలోచన విధానాలను పునికిపుచ్చుకున్న వ్యక్తి అయివుండాలన్నారు. అప్పుడే సార్థకత లభిస్తోందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగూనంగా పనిచేసిన ఏకైక వ్యక్తి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని మేరుగు గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, వైయస్‌ఆర్‌ పెట్టిన ప్రతీ సంక్షేమ పథకం అంబేద్కర్‌ ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. కానీ చంద్రబాబు హయాంలో పేద ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. బాబు గత 9 సంవత్సరాలు, ప్రస్తుత 3 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలను అగణదొక్కుతున్నాడని మండిపడ్డారు. బిజినెస్‌ స్కూల్‌ పెడితే రిజర్వేషన్లు లేవని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని చురకంటించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక్క ఇళ్లు అయినా కట్టించారా.. లేక పేదవాడికి ఒక్క సెంట్‌ భూమి అయినా పంచారా అని చంద్రబాబును కడిగిపారేశారు. 

అంబేద్కర్‌ ఆశయాలను బతికించే ఏకైక నేత వైయస్‌ జగన్‌
రాజధాని ప్రాంతానికి దూరంగా అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటే చంద్రబాబుకు దళితులు, అంబేద్కర్‌ అంటే ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందని మేరుగు విమర్శించారు. ఇదేనా చంద్రబాబుకు అంబేద్కర్‌పై ఉన్న భక్తి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అని చెప్పి... సంవత్సరం తరువాత శంకుస్థాపన చేయడాన్ని మేరుగు తప్పుబట్టారు. దళితులను కించపరిచిన చంద్రబాబుకు అంబేద్కర్‌ విగ్రహానికి దండేసే అర్హత లేదన్నారు. గుండెలేని వ్యక్తి ఎన్ని దండలేస్తే ఏంటని ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ పాదాల దగ్గర మట్టితో స్నానం చేసి మైల కడుక్కొని ఆయన పాదాలకు క్షమాపణలు చెప్పి చంద్రబాబు దండేయాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి దళితులకు సంక్షేమాలను అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు అంబేద్కర్‌ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని మేరుగు ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను బతికించాలని పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని స్పష్టం చేశారు. 
Back to Top