విధ్వంసానికి చంద్రబాబు కుట్ర

వైయస్ జగన్ పాదయాత్రతో బాబుకు ముచ్చెమటలు
విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు స్కెచ్
  • బాబు కుట్రలను పోలీసులు తిప్పికొట్టాలి
  • ప్రతిపక్ష నేతకు పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పించాలి
  • బాబును ప్రజలు నమ్మే పరిస్థితులో లేరు
  • ప్రజాసంకల్పంతో ప్రజల కోసం వైయస్ జగన్ పాదయాత్ర
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్ః చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టనున్న ప్రజాసంకల్ప పాదయాత్ర నేపథ్యంలో ఏసీలో కూర్చున్నా బాబుకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. వైయస్ జగన్ పాదయాత్రలో విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, పోలీసులు బాబు కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. ప్రతిపక్ష నేతకు పూర్తి భద్రత కల్పించాలని పోలీసు డిపార్ట్ మెంట్ ను కోరారు. కుట్రలన్నీ చంద్రబాబు చేస్తూ ఆ నెపాన్ని వైయస్ జగన్ పై నెడుతున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ పాదయాత్ర పేరుతో విధ్వంసాలు చేయబోతున్నాడని బాబు తన పార్టీ నేతలతో చెప్పిస్తున్నాడంటే ....అధికార బలంతో ఆయన కుట్రలకు స్కెచ్ వేస్తున్నాడని అర్థమవుతోందన్నారు.  ప్రజాసంకల్పంతో ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ కు భద్రత కల్పించాలన్నారు. కుట్రలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని,  ఆయన రాజకీయ జీవితమంతా కుట్రలతోనే నిండిఉందని రోజా అన్నారు. బాబు నరనరాన రక్తానికి బదులు కుట్రలు, కుతంత్రాలే ప్రవహిస్తున్నాయన్నారు. చంద్రబాబు తన కుటుంబసభ్యులకు ఏవిధంగా వెన్నుపోటు పొడిచాడో అందరికీ తెలిసిందేనన్నారు. 

బాబు కుట్రలు
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన కుట్ర చంద్రబాబుది. ఎర్రచందనం స్లగ్మర్ల పేర్లు బయటకొస్తాయని తమిళనాడు కూలీలను చంపించిన కుట్ర చంద్రబాబుది. రాజధానిలో రైతుల భూముల్ని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ సైడర్ ట్రేడింగ్ తో దోచేసుకోవాలన్న కుట్ర చేసింది చంద్రబాబు. ప్రత్యేక హోదా పదేళ్లు కాదు 15ఏళ్లు ఇవ్వాలని చెప్పి, హోదా వేస్ట్ అంటూ కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న కుట్రదారుడు చంద్రబాబు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న కుట్రతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ కుట్రదారుడు చంద్రబాబు. ఉమ్మడి రాజధాని, ఏపీ హక్కుల్ని కాలరాసే కుట్రలు జరిగింది నీవల్ల కాదా బాబూ..?నీవు, నీ కొడుకు మూడున్నర లక్షలకోట్లకు పైగా దోచుకుంటే ఎక్కడ సీబీఐ ఎంక్వైరీ వేస్తారోనని కేంద్రం వద్ద సాగిలపడి రాష్ట్రాన్ని నాశనం చేసింది  నీవు కాదా బాబూ..? వైయస్ జగన్ ను ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుంది నీవు కాదా బాబూ...? సోనియాగాంధీతో కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టించింది, రాష్ట్రాన్ని విడగొట్టమని లేఖ రాసి సర్వనాశనం చేసింది నీవు కాదా బాబూ..? కుట్రలన్నీ నీవు చేస్తూ జగన్ కుట్ర చేస్తారని చెబుతావా అంటూ చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు. 

తునిలో విధ్వంసం చేసింది టీడీపీ అని రిపోర్ట్ లో వచ్చింది కాబట్టే బాబు సైలెంట్ అయ్యాడని రోజా స్పష్టం చేశారు. తుని ఘటనను వైయస్ జగన్ పై నెట్టాలని చూస్తున్నారని బాబుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ  రూరల్ ఎస్పీ నిష్పక్షపాతంగా తప్పుచేసిన వాళ్లను ఏరేస్తుంటే ఎక్కడ టీడీపీ నాయకులు బలైపోతారోనని బాబు ఆ ఆఫీసర్ ను ట్రాన్స్ ఫర్ చేశాడన్నారు.  

రాజన్న కుటుంబంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ ఓదార్పుయాత్ర చేశారు. అనునిత్యం ప్రజల్లో ఉన్నారు. ఏరోజు విధ్వంసం జరగనిది, ఈరోజు జరుగుతుందని బాబు మాట్లాడుతున్నాడంటే ఆయన కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.  600 హామీలిచ్చి నెరవేర్చకుండా బాబు అందరినీ మోసం చేశారని, చేసిన సంతకాలకు విలువ లేకుండా చేశారని రోజా మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన బాబును నడిరోడ్డుపై నిలబెట్టి, ఆయన చేసిన తప్పులకు  ప్రజలకు క్షమాపణ చెప్పించి టీడీపీని ఇంటిదారి పట్టించేందుకే వైయస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అని రోజా పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైయస్ జగన్ ప్రతి కుటుంబానికి బాబు చేస్తున్న కుట్రలు చెప్పి చైతన్యపరుస్తారని రోజా తెలిపారు. 

వైయస్ఆర్ పాదయాత్ర ద్వారా  చారిత్రాత్మక నిర్ణయాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఎలా మంచి చేశారో చూశామన్నారు. ఎన్నికష్టాలొచ్చినా మాట తప్పని,  మడమ తిప్పని కుటుంబం రాజన్న కుటుంబం అని ప్రజలందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలోని కోట్లాది మంది వైయస్ఆర్ అభిమానుల ఆశీర్వాదం, సపోర్ట్ తో వైయస్ జగన్ పాదయాత్ర చేస్తారని రోజా చెప్పారు.
బాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పారు. టీడీపీ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, పోలీసులు వైయస్ జగన్ కు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
Back to Top