చంద్రబాబువి నీచ రాజకీయాలు: సంకినేని

- జగన్‌తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని సమావేశం
- మరుక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టిడిపి

హైదరాబాద్, 9 ‌అక్టోబర్‌ 2012: నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సోమవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను ఆయన ప్రత్యేక ములాఖత్‌ సమయంలో  కలిశారు.

జగన్‌ను కలిసిన సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఈ నెల 4న టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని కలిసి జగన్ ఆస్తుల అటా‌చ్‌మెంట్ కోరారని అన్నారు.‌ జగన్మోహన్‌రెడ్డి నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుని బాబు నీచ‌ రాజకీయాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీలు కుమ్మక్కైనా రా‌ష్ట్ర ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి వైయస్‌ఆర్‌ సిపికి పట్టం కట్టారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన ‌టిడిపిని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించి వైయస్‌ఆర్‌ సిపిలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని ఆయన తెలిపారు. సంకినేని గతంలో నల్లగొండ జిల్లా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు.

కాగా, వెంకటేశ్వరరావు జగన్‌తో సమావేశమైన తర్వాత కొద్దిసేపటికే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మ‌న్ ఎ‌ల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ ఎ‌స్ఎంఎ‌స్ ద్వారా మీడియాకు సమాచారం ‌పంపించారు. సంకినేని వెంకటేశ్వరరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ఆ సమాచారంలో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top