<strong>గుంటూరు, 14 మార్చి 2013:</strong> టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ఆయన ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేత అధికార పక్షంతో కుమ్మక్కపోయి నీచ రాజకీయాలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. ఈ తప్పిదానికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.<br/>అసమర్థ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలని బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు తెరవెనుక కుమ్మక్కయ్యారని అంబటి రాంబాబు ఆరోపించారు. విప్ జారీ చేశానని చంద్రబాబు సంబరపడుతున్నారేమో గాని అదే ఆయనకు గుణపాఠంగా మారనున్నదన్నారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయ పార్టీ అని, దాన్ని దించేయాలి, దానికి ఈ రాష్ట్రాన్ని ఒక్క క్షణం కూడా పరిపాలించే అర్హత లేదని, దానిపై కత్తులు, గొడ్డళ్ళతో తిరగబడమని చంద్రబాబు చెబుతున్నారన్నారు. అయితే, అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఎందుకు పారిపోతున్నారు? దాని వెనక ఉన్న రహస్యం ఏమిటని ఆయన నిలదీశారు.<br/>అధికార పక్షం చేసే తప్పులను అడుగడుగునా నిలదీయాల్సిన బాధ్యత నుంచి చంద్రబాబు పారిపోతున్నారన్నారు. గతంలో ఈ ప్రభుత్వాన్ని చిరంజీవి గట్టెక్కించినట్టే ఇప్పుడు చంద్రబాబు మరో చిరంజీవి అవతారం ఎత్తారని, అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.