చంద్రబాబుది ఆఖరి పోరాటం: అంబటి

హైదరాబాద్, 25 సెప్టెంబర్‌ 2012: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాదయాత్రకు 'నిజంగా వస్తున్నా నమ్మండి' అని పేరు పెట్టుకుంటే మంచిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూచించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టి, ఎనిమిదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటున్న ఈ వ్యక్తికి ప్రజల కష్టాలు తెలియవా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అంబటి రాంబాబు నిలదీశారు. 2014లో కూడా తాను ముఖ్యమంత్రి కాలేమోనన్న భయంతోనే చంద్రబాబు చివరి ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అధికారం కోసం బాబుది ఆఖరి పోరాటమని ప్రజలు అనుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు.
Back to Top