'చేనేత కార్మికులకు ప్రభుత్వం మొండిచెయ్యి'

కర్నూలు: చేనేత కార్మిల అభివృద్ధి, సంక్షేమం కోసం మహానేత వైయస్ రాజశేఖ‌రరెడ్డి అవిరళ కృషి చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గుర్తుచేశారు. ఆ మహానే రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం చేనేతన్నలకు మొండిచెయ్యి చూపిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేనేత కార్మికుల కోసం వైయస్ రూ. 312 కోట్లు కేటాయించారన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ నిధులు మంజూరు చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులను వేధిస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు  ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న షర్మిల కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో  షర్మిల శుక్రవారంనాడు పెద్దకడుబూరు మండలం హెచ్. మురవణి నుంచి ఎమ్మిగనూరు వరకు 13 కిలోమీటర్లు ‌నడిచారు. చేనేత కార్మికులు అధికంగా ఉన్న ఎమ్మిగనూరులో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ వారి సమస్యలపై స్పందించారు. నేతన్నలకు టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో జరిగిన జరుగుతున్న అన్యాయాలను వివరించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలాది మంది చేనేత కార్మికులు బతుకులు భారమై ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తుచేశారు. అలా ఆత్మ బలిదానం చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని మహానేత వైయస్ కోరినా అప్పట్లో ‌చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అయితే, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఒక్కొక్క నేత కార్మికుని కుటుంబానికి లక్షన్నర చొప్పున నష్టపరిహారం చెల్లించారన్నారు. చేనేత కార్మికుల కష్టాలను అతి సమీపం నుంచి చూసిన వైయస్‌ వారికి 50 ఏళ్లకే పింఛన్లు అందేలా కృషి చేశారని గుర్తుచేశారు. నేత కార్మికులు నేసిన బట్టలనే ధరించిన రాజశేఖరరెడ్డికి చేనేత కార్మికులంటే ఎంతో ప్రేమ అన్నారు. ఆయన మరణించినా... చేనేత కార్మికులు నేసే ప్రతీ బట్టపైన ఆయన చిరునవ్వే కనిపిస్తుంద’ని అని షర్మిల ఉద్వేగంగా చెప్పారు. 

Back to Top