విజయమ్మ, భారతికి సిబిఐ కోర్టు అనుమతి

హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరిన శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి సహాయంగా ఉండేందుకు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, శ్రీమతి భారతిలకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకూ వారు శ్రీ జగన్తో ఉండేందుకు న్యాయస్థానం అంగీకరించింది.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవరకూ వారు సాయంగా ఉండేందుకు కోర్టు అనుమతి తెలిపింది. కోర్టు తీర్పుతో శ్రీమతి విజయమ్మ, శ్రీమతి భారతి హుటాహుటిన నిమ్సు ఆస్పత్రికి బయల్దేరి వెళ్ళారు.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ శ్రీ జగన్‌ గడచిన ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ ఆదివారంనాడు చంచల్‌గూడ జైలులోనే ఆయన దీక్ష ప్రారంభించారు. శనివారానికి శ్రీ జగన్‌ దీక్ష ఏడవ రోజుకు చేరింది. ఏడు రోజులుగా కఠోర దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌ ఆరోగ్యం శనివారానికి బాగా క్షీణించింది. శనివారం ఉదయం నిమ్సు వైద్యులు విడుదల చేసిన హెల్తు బులెటిన్‌ ప్రకారం ఆయన కనీసం లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. శ్రీ జగన్‌ బిపి, సుగర్‌ స్థాయిలు, పల్సు రేట్ బాగా తగ్గిపోయాయి. కీటోన్సు అధికంగా విడుదల అవుతున్నాయి.

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన సతీమణి శ్రీమతి భారతి శుక్రవారంనాడు సిబిఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. శ్రీ జగన్‌ మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించి, నిర్ణయాన్ని శనివారానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్ నిమిత్తం భారతి శుక్రవారం స్వయంగా కోర్టుకు హాజరై విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top