బడ్జెట్‌ సమావేశాలు 13 రోజులేనట

  • శాసనసభ చరిత్రలోనే అతి తక్కువ సమావేశాలు ఇవే
  • సమావేశాలను పొడిగించాలని కోరితే పెడిచెవిన పెట్టారు
  • ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజులే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం పద్ధతి కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.  బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరితే మంత్రి యనమల రామకృష్ణుడు ఒప్పుకోవడం లేదన్నారు. తాను  ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఇలాంటి విధానాలు ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు.  శాసనసభ చరిత్రలోనే అతి తక్కువ రోజులు నిర్వహించే బడ్జెట్ సమావేశాలు ఇవేనని అన్నారు. బీఏసీలో పెట్టిన అంశాలు హౌస్‌లో చర్చించడం లేదని చెబితే పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  బడ్జెట్‌ సమావేశాలు మరో పది రోజులు పొడిగిస్తే బాగుంటుందని బీఏసీ సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

43 అంశాలపై చర్చించాలని కోరాం
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన 43 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో కోరినట్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీఏసీ సమావేశంలో  అసెంబ్లీ బిల్డింగ్‌ బ్రహ్మండంగా కట్టుకున్నామని, సభ్యులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చర్చించారన్నారు. ఇంతకంటే ముఖ్యంగా ప్రజల సమస్యలపై చర్చించేందుకు సభా సమయాన్ని పొడిగించాలని మేం కోరితే  అందుకు అధికార పక్షం ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు.  మేం సూచించిన 43 అంశాలపై చర్చించే ధైర్యం మీకుంటే సభను పొడిగించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రానికి  ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లోపాలు, మహిళలపై పెరుగుతున్న దాడులు, సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంపు, అవినీతి, ఆరోగ్యశ్రీ, 104, 108పై ప్రభుత్వం నిర్లక్ష్యం, రాష్ట్రంలో ప్రైవేట్‌ పెరుగుదల, అగ్రిగోల్డు బాధితుల సమస్యలు, బలహీన వర్గాలకు పక్కా గృహాలు, కేంద్ర ప్రభుత్వ సాయం, కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ విధానం, కృష్ణా, గోదావరి పుష్కరాలలో నిధుల దుర్వినియోగం, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి– దేశంలో మన స్థానం, ఈ–పాస్‌ బుక్‌ విధానం–లోపాలు, నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల భర్తీ,  ఉపాధి అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్, దళితులపై దాడులు, కరెంటు బిల్లలు, చేనేత రంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక రంగం–పెట్టుబడులు, విద్యుత్‌ చార్జీల పెంపు– ప్రభుత్వ విధానం, నీరు–చెట్టు, ఉపాధి అవకతవకలు, వలసలు, విదేశీ పర్యటనలు ప్రభుత్వం దుబారా, డ్వాక్రా సంఘాల మనుగడ, బలవంతపు భూ సేకరణ–పెట్టుబడిదారులకు భూ పందేరాలు, స్థానిక సంస్థల నిర్వాహణ, హక్కులు, బాధ్యతలు వంటి అంశాలను బీఏసీ సమావేశం దృష్టికి తీసికెళ్లినట్లు చెప్పారు. అయితే శాసన సభ వ్యవహారాల మంత్రి వీటిపై చర్చించే సమయం లేదని, సభను 13 రోజుల కంటే ఎక్కువ నిర్వహించలేమన్నారు. ఇంతకంటే ముఖ్యమైన పనులు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పడం బాధాకరమన్నారు.
Back to Top