భవిష్యత్ కార్యాచరణపై వై‌యస్‌ఆర్‌ సిపి కసరత్తు

హైదరాబాద్, 10 అక్టోబర్ 2012:‌ భవిష్యత్ కార్యాచరణపై వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలతో పాటు సమస్యలపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ నిర్ణయించింది. బుధవారంనాటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పలు కీలక నిర్ణయాలను పార్టీ నాయకులు ప్రకటించనున్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలు ఈ నెల 6 వ తేదీన కేంద్రకార్యాలయంలో రెండు విడతలుగా సమావేశమై సమాలోచనలు చేశారు. సమావేశంలో చర్చించిన అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో పాటు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దృష్టికి తీసుకెళ్ళారు.
అనంతరం ఈ నెల 8 న పార్టీ కేంద్ర పాలకమండలి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులతో కూడా విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలనుకున్నారు. అయితే, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ రావడంతో అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళాళ్సివచ్చింది. దీనితో ఆ రోజు జరగాల్సిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఈ  సమావేశానికి ‌సిజిసి, సిఇసి సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ ముఖ్యనేతలు సూచించారు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో కూడా అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. మొత్తానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మరోసారి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశ‌ంలో పార్టీ తీసుకునే నిర్ణయాలతో ఆ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Back to Top