సురేఖ విజ్ఞతకే ఆరోపణలను వదిలేస్తున్నాం

హైదరాబాద్, 29 జూలై 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను పార్టీ నాయకులు ఖండించారు. సురేఖ వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని పార్టీ కేంద్ర పాలకమండలి, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ సోమవార‌ం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో అన్నారు. శ్రీ జగన్‌పై గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు ‌ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు సురేఖ ఏ విధంగా సమర్ధవంతంగా తిప్పికొట్టారో ఓసారి మననం చేసుకోవాలని బాజిరెడ్డి సూచించారు. తెలంగాణకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు.

సురేఖ మంత్రి పదవిని, కొండా మురళి ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారనడంలో ఏ మాత్రం వివాదం లేదని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఏదైమైనప్పటికీ మనందరం కూడా ఎవరో ఒకరు ఏదో ఒక త్యాగం చేసి మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి‌ కుటుంబానికి కష్టాల్లో అండగా ఉండాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా తట్టుకోవాలి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చినవాళ్ళం అందరం కూడా అని గుర్తుచేశారు. పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉండడంతో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నడుం బిగించి పటిష్టం చేస్తున్నారని, ఈ సమయంలో అభాండాలు వేయవద్దని సురేఖకు బాజిరెడ్డి హితవు పలికారు. ఆమె చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ విషయంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యూటర్ను తీసుకున్నదని సురేఖ ఆరోపించడం సరికాదని బాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని బాజిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి తెలంగాణకు అనుకూలమనో, లేదా రాయల తెలంగాణకు అనుకూలమనో, ఇంకోసారి హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేసి మిగతా రాష్ట్రాన్ని విభజిస్తామనో ఇలా రకరకాల లీకులు ఇస్తూ.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను అస్థిరపరుస్తూ చేస్తున్న చర్యలకు నిరసనగా రాజీనామా చేశామని పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత తామంతా శ్రీమతి విజయమ్మను ప్రశ్నించామన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టంచేశారన్నారు.

ఈ పరిస్థితుల్లో పార్టీలోని తెలంగాణ వాదులంతా చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకునే బదులు ఏకపక్షంగా వ్యవహరించి, ఇబ్బందుల్లో ఉన్న శ్రీమతి విజయమ్మను కొండా సురేఖ తదితరులు నిలదీసి మరింతగా బాధపెట్టడం సరికాదని బాజిరెడ్డి అన్నారు. అయినప్పటికి ఆదివారంనాడు తెలంగాణలోని జిల్లాల కన్వీనర్లు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్టమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు 40 మంది సమావేశమై పరిస్థితిపై చర్చించామన్నారు.

పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాల తరువాత జరిగిన పరిణామాలు, శ్రీమతి విజయమ్మను సురేఖ తదితరులు నిలదీయడంతో పార్టీకి తెలంగాణ ప్రాంతంలో కొంత నష్టం జరిగిందని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై శ్రీమతి విజయమ్మ వివరణ ఇవ్వాలని తాము కోరినట్లు చెప్పారు. ఇవాళో రేపో శ్రీమతి విజయమ్మ ఆ దిశగా స్పందించే సమయంలో కొండా సురేఖ ఈ విధంగా బహిరంగ లేఖ రాయడం సరికాదని తాము భావిస్తున్నామన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో కీలకమైన నాయకురాలిగా ఉండి, రాష్ట్రమంతా తిరిగి.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలిచిన విషయం మరిచిపోవద్దన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి కుటుంబం కష్టాల నుంచి బయట పడే వరకూ తోడుగా ఉంటే బాగుండేదని బాజిరెడ్డి అన్నారు. సురేఖ చేసిన ఆరోపణలకు తాము ప్రత్యారోపణలు చేయడంలేదన్నారు. సురేఖ చేసిన తీవ్రమైన ఆరోపణలు వెనక్కి తీసుకుంటే ప్రజలంతా మునుపటి మాదిరిగానే గౌరవిస్తారని, పార్టీలో కూడా ఆదరణ ఉంటుందని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top