విచారణ పక్కదారి పట్టే ప్రమాదంహత్య రాజకీయాల్లో చంద్రబాబుది ఘనమైన చరిత్రవైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
విజయనగరంః అరకు హత్యలకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కిడారి, సోమ హత్యల వెనుక టీడీపీ నాయకులే ఉన్నారని పచ్చమీడియాలోనే కథనాలు వస్తున్నాయన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. హత్యలకు టీడీపీకి చెందిన ఎంపిటీసీ సభ్యులు, మండల స్థాయి నాయకులే సాయం చేసినట్లుగా తెలుస్తుందన్నారు. టీడీపీ నేతలే ఉప్పుందించిన కారణంగానే కిడారి హత్యకు దారితీసిన పరిస్థితి స్పష్టమవుతున్నదన్నారు. ఈ కారణంగానే విచారణ పక్కదారి పట్టించి నీరుగార్చే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యల వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యనించి, రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. తనకు అడ్డువచ్చిన, విబేధించిన వారిని తుదముట్టించడం చంద్రబాబు నాయుడి నైజమని, హత్యా రాజకీయాల్లో చంద్రబాబుకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. గతంలో వంగావీటి మోహన్‌రంగా హత్యలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని మాజీ హోంమంత్రి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ప్రస్తావించారన్నారు. విజయవాడ నడ్డిబొడ్డున రాఘవేంద్రరావు అనే ఐఎస్‌ఎస్ అధికారిని స్కూటర్ మీద ఢీకొట్టి హత్యచేయించిన సంఘటనలో తెలుగుగుదేశం అగ్రనాయుకుడి హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయన్నారు. పరిటాల రవి హత్య తర్వాత రాష్ట్ర మంతటా అగ్గిరాజేయండి అని చంద్రబాబు అన్నట్లు పార్టీలోని ప్రముఖ నాయకులే అన్నారని గుర్తుచేశారు. తునిలో రైలును చంద్రబాబే తగలపెట్టించి కాపు ఉద్యమానికి తీవ్ర ద్రోహం చేశారన్నారు. విచారణలో కేసు మూలాల్లోకి వెళ్ళితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు రైలుకు నిప్పుపెట్టారని తెలిసి వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో సిఐడి విచారణ నిలుపుదల చేయించారని తెలిపారు.అమరావతిలో తోటలు తగలపెట్టి వైసీపీ నాయకులు తగలపెట్టారని వారిపైకి నెట్టె విశ్వప్రయత్నం చేశారన్నారని తెలుగుదేశం, చంద్రబాబు నైజాన్ని ఎండగట్టారు.
వాస్తవం చెప్పిన కిడారి మరణ వాగ్మూలం...
మావోయిస్టులు కిడారిని హత్యచేసే ముందు పార్టీ మారినందుకు ఎంత పుచ్చుకున్నావు అన్న ప్రశ్నకు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు చెప్పినట్లు కిడారి గన్‌మెన్‌లే వెల్లడించిన అంశాలతో, వాస్తవం ఏమిటనేది స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు ముఠా ఎంత బుకాయించినా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని చెప్పడానికి సర్వేశ్వరరావు మరణవాగ్మూలం కన్నా ఆధారం ఏది లేదన్నారు. అధికార దాహంతో టీడీపీ ప్రభుత్వం బరితెగిస్తున్నదని, అబద్ధాలు, మోసాలు, వంచించే హామీలతో మోసపూరిత విధానాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు.. విశృంఖలంగా రాజకీయ లబ్ధికోసం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని , దోపిడీనే ధ్యేయంగా తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అరాచకాలకు పోలీసులు, నిఘా వ్యవస్థలు అడుగులకు మడుగులెత్తడం సిగ్గుచేటన్నారు.