బాబూ.. నీకు అంత సీన్‌ లేదు?: అసదుద్దీన్‌

- వైయస్‌ పాదయాత్రకు ఏదీ సాటి రాదు
- తొమ్మిదేళ్ల పాలనలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేశావు?
- బాబు పాదయాత్ర మధ్యలోనే ముగిసిపోవడం ఖాయం

హైదరాబాద్, 4 అక్టోబర్‌ 2012: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 2003 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రకు మరేదీ సాటి రాదని హైదరాబాద్‌ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. వైయస్‌ మాదిరిగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పగటి కలలు కంటున్నారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. అయితే, అంత సీన్‌ లేదన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుంటే మేలని అన్నారు. తమ తాత మౌలానా మహ్మద్‌ అబ్దుల్‌ 
వాహెద్‌ ఒవైసీ 37వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అసదుద్దీన్‌ మాట్లాడారు. మోతీగల్లీలో జరిగిన కార్యక్రమంలో అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ తదితరులు అబ్దుల్ వాహెద్‌ నివాళులర్పించారు.

పాదయాత్రలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేయాలి గానీ, అధికారం కోసం చేస్తే ప్రజలు విశ్వసించబోరని 
అసదుద్దీన్‌ అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ముఖ్యమంత్రి కాగలిగారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైయస్‌ ఎంతో కృషి చేశారని చెప్పారు.

వైయస్‌ పాదయాత్రను కాపీ కొడుతున్న చంద్రబాబుకు నిరాశే ఎదురవుతుందని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, 
ముస్లింలకు తగిన సీట్లు ఇస్తానని ఇప్పుడు కొత్తగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను నమ్మించడం కష్టమని, గ్రామాల్లో ముస్లిం మైనార్టీలు బాబును తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు పాదయాత్ర మధ్యలోనే ముగించుకొని తిరిగి రావడం ఖాయమని అన్నారు.
Back to Top