అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మద్దతు

హైదరాబాద్, 25 మే 2013:

అసమర్థ, ప్రజాకంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే బి. గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. ‌చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అవిశ్వాసం ప్రవేశపెడితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు గుర్నాథరెడ్డి సమాధానంగా ఈ జవాబు చెప్పారు.

గతంలో టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ మద్దతు ఇచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు వీల్లేదని తాము చంద్రబాబు అవిశ్వాసానికి అనుకూలంగా నిలిచామన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజా కంటక కాంగ్రెస్‌ను గద్దె దింపాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‌అసెంబ్లీలో తీవ్రంగా ఎండగడతామని గుర్నాథరెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం పాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోషిస్తుందన్నారు.

Back to Top