అవిశ్వాస భయంతో పారిపోయిన ప్రభుత్వం

హైదరాబాద్, 8 డిసెంబర్ 2012:అవిశ్వాస తీర్మానం పెడతారనే భయంతోనే శీతాకాల శాసన సభ సమావేశాలు నిర్వహించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారిపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. సమావేశాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం 9 కోట్ల మంది ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.  

     షెడ్యూలు ప్రకారం శాసన సభ సమావేశాలు వెంటనే నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన సభను పరిహాస సభగా మార్చిందన్నారు. సమావేశాలు పెడతామని తాము చెప్పలేదంటూ  పిసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతల మానసిక వైకల్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని ఎద్దేవా చేశారు.

     డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని శాసన సభ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఆ నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజా ద్రోహానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నట్టు రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు.

Back to Top