చీఫ్‌ మినిస్టర్‌వా.. కమీషన్ల మినిస్టర్‌వా

– సీఎం చంద్రబాబుపై భూమన ధ్వజం
– ఏపీఐడీఈ చట్టానికి సవరణలపై ఆగ్రహం
– అధికారాలన్నీ ముఖ్యమంత్రికి కట్టబెట్టడంపై మండిపాటు

హైదరాబాద్ః కేల్కర్‌ కమిటీ వ్యతిరేకించిన స్విస్‌ చాలెంజ్‌ దోపిడీ విధానాన్ని కమీషన్ల కోసమే కక్కుర్తి పడి చంద్రబాబు కొనసాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ  ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తప్పులు తడకలుగా ఉందన్న ఆంధ్రప్రదేశ్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబ్లింగ్‌ యాక్టుకు ప్రభుత్వం అరకొరగా మార్పులు చేసి అధికారాలను ముఖ్యమంత్రికి కట్టబెడుతూ జనవరి 3న జారీ చేసిన జీవోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట రహస్యం రాజుగారికే తెలుసు అనే నానుడిలాగే.. సింగపూర్‌ రహస్యం బాబుకే తెలుసు అనేది ఇప్పుడు నానుడి అన్నారు. ఒక్కో ఎకరా దాదాపు 20 నుంచి 30 కోట్లు విలువ చేసే 1691 ఎకరాల భూమిని సింగపూర్‌ కంపెనీలకు ఎంతకు కట్టబెట్టారో చెప్పకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 

స్విస్‌ చాలెంజ్‌ 25 ఏళ్ల నిరంతర దోపిడీ 
స్విస్‌ చాలెంజ్‌ విధానం అనేది రెండున్నర దశాబ్దాల నిరంతర  దోపిడీ అని భూమన మండిపడ్డారు. దేశంలోని న్యాయస్థానాలు  వ్యతిరేకించిన విధానానికే చంద్రబాబు కట్టుబడటం వెనుక దాదాపు 50 వేల కోట్ల దోపిడీకి పథక రచన చేశారని వెల్లడించారు. 35 వేల ఎకరాల భూమిని లాక్కున్న ప్రభుత్వం కేవలం 1691 ఎకరాల్లోనే ఇంత భారీ దోపిడీకి పాల్పడుతుంటే మిగతా 33,300 ఎకరాల్లో ఎంత బొక్కుతారోనని అనుమానం వ్యక్తం చేశారు. కేవలం 306 కోట్లు పెట్టే సింగపూర్‌ కంపెనీలకు 48 శాతం వాటా ఇచ్చి.. 5700 కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టే రాష్ట్రానికి 42 శాతం వాటానా అని ప్రశ్నించారు. సింగపూర్‌ కన్సార్టియంకు భూములు కట్టబెట్టడం వెనుక బాబుకు అంత ప్రేమ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన కమిటీలో సీఆర్‌డీఏ అధికారుల పాత్రే లేకుండా అందరూ సింగపూర్‌ ప్రతినిధులను ఏర్పాటు చేసుకుని బినామీల కోసం ముఖ్యమంత్రి పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై వ్యతిరేకత వచ్చినా చర్చించడానికి బ్రిటన్‌ వెళ్లాలని అడ్డగోలు నిబంధనలు పెట్టడం చూస్తుంటేనే ఇదెంత అడ్డగోలు దోపిడీనో తేటతెల్లం అవుతుందని ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. 

డెవలప్‌మెంట్‌కీ మనవాళ్లు పనికిరారా...? 
ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియంకు స్వాధీనం చేసిన 1691 ఎకరాల్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపడతారో ఇంతవరకు ప్రకటించకపోడం కూడా కుట్రలో భాగమేనన్నారు. కేవలం ఆ భూమిని డెవలప్‌మెంట్‌ కోసమే సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించారని.. ఆ మాత్రం డెవలప్‌మెంట్‌ చేసే సత్తా కూడా మన వాళ్లకు లేదా అని ప్రశ్నించారు. దేశం గర్వించే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్లు పుట్టిన దేశంలో ఆయన కళ్లకు ఇంజినీర్లు కనబడలేదా అని ఎద్దేవా చేశారు. నాసాలో మన భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంటే చంద్రబాబుకు మాత్రం మురికివాడలు కట్టే వాళ్లగానే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డింగ్‌ కోసం కూడా ఏ కంపెనీలు రాకుండా పక్కాగా నియమ నిబంధనలు రాసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబ్లింగ్‌ యాక్టుకు తమకు అనుకూలంగా సవరణలు చేసుకుని న్యాయస్థానాలను కూడా మోసం చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విస్‌ చాలెంజ్‌లో ప్రభుత్వ ఆదాయం ఎంతో చెప్పాలని హైకోర్టు కోరినా బయటకు తెలియనీయకుండా చేయడం శోఛనీయమన్నారు. న్యాయస్థానాలకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనన్నారు. జనాలు చంద్రబాబు మాయలన్నీ గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ విషయం గమనించే చంద్రబాబు మైకుల ముందుకొచ్చి న న్ను తల్చుకోండని ఒకటే వేధిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. 
Back to Top