‌అన్ని పథకాలకూ తూట్లు!

ఆదోని 13 నవంబర్ 2012 : ప్రజల మనసుల్లోంచి వైయస్‌ను చెరిపేయాలనే దురుద్దేశ్యంతో ఆయన పథకాలన్నిటికీ తూట్లు పొడుస్తోందని షర్మిల ఆరోపించారు. వైయస్ హయాంకూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనకూ మధ్య ఉన్న తేడాను షర్మిల సోదాహరణంగా వివరించారు. మంగళవారం 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆదోని సభలో మాట్లాడుతూ ఆమె విద్యుత్తు సంక్షోభం, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, నీరుగారుతున్న ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఆమె మాటల్లోనే...
"రాజన్నకి రైతన్న అంటే చాలా ప్రేమ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రైతన్నలను చాలా నిర్లక్ష్యం చేసింది. వారిని గాలికొదిలేసింది. ఇప్పుడు తక్కువ ధరకు వచ్చే ఎరువులూ లేవు. విత్తనాలూ లేవు. నాలిగింతలు రేట్లు పెరిగాయి. ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు. ఇప్పుడు ఏడుగంటల ఉచిత కరెంట్ లేదు. నీళ్లూ లేవు. పంటపోతే బీమా లేదు. ఈ ప్రభుత్వం అన్నదాత కడుపు మీద కొడుతోంది. రైతన్న ఏడుస్తూంటే వేడుక చూస్తోంది. కనీసం పిల్లల్ని చదివించుకునే స్థితి లేదు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నా ఈ సర్కారు చెవిన పడడం లేదు." అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 
"మహిళలను రాజన్న సొంత తోబుట్టువులుగా చూసుకున్నారు. వారిని లక్షాధికారులను చేయాలనుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం మహిళల బ్రతుకుల మీద కొడుతోంది. నిత్యావసరాల ధరలన్నిటినీ పెంచేసి వారి బ్రతుకు దుర్భరం చేసేసింది. పావలావడ్డీ కాదు కదా రెండు రూపాయల వడ్డీ పడుతోందని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. రాజశేఖర రెడ్డిగారున్నప్పుడు ఉపాధి హామీ పథకం అద్బుతంగా జరిగేది. రూ.120 దాకా చెల్లించేవారు. కానీ ఇప్పుడు రూ.30, రూ.50 ఇస్తున్నారు. ఇలాగైతే తమ పిల్లలను ఎలా చదివించుకోలమని వారు వాపోతున్నారు. ఈ ప్రభుత్వం తాగేందుకు కూడా నీళ్లివ్వడం లేదు"అని ఆమె విమర్శించారు.
"విద్యార్థులకు రాజశేఖర్ రెడ్డిగారు అండగా నిలబడ్డారు. ప్రతి కుటుంబం నుండి పెద్ద చదువులు చదివినవారుండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపిస్తోంది. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకానికి కత్తెరలు పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఒక్క ప్రాంతంలోనే గుండె ఆపరేషన్లు 500 వరకూ జరిగాయట. కానీ ఇప్పుడు చాలా వ్యాధులను ఆరోగ్యశ్రీ కార్పొరేట్ జాబితా నుండి తొలగించారు. జబ్బు వస్తే పేదవాడు మందులే ఉండని ప్రభుత్వాసుపత్రులకే వెళ్లాలట. 108 ఇప్పుడు ఎక్కడా కనిపించదు"అని ఆమె నిందించారు.
"కేంద్ర ప్రభుత్వం దేశమంతా కలిపి ఐదేళ్లలో నలభై లక్షల ఇళ్లు కట్టిస్తే, రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నలభై లక్షల ఇళ్లు కట్టించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇళ్ల విషయం పట్టలేదు. ఒకటి కాదు, రెండు కాదు. మీరంతా రాజశేఖర్ రెడ్డిగారిని మరచిపోవాలని ఈ ప్రభుత్వం ఆయన ప్రతి పథకానికీ తూట్లు పొడుస్తోంది" అని షర్మిల ఆరోపించారు.
"కిరణ్ కుమార్ రెడ్డిగారు పదిహేను లక్షల ఉద్యోగాలిప్పిస్తామన్నారు. కానీ అందులో పది పర్సంట్ కూడా ఇప్పించారో లేదో మరి!  ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామన్నారు. అరవై కోట్లు కూడా తెచ్చారో లేదో మరి! కొత్త పరిశ్రమల మాటేమో గాని విద్యుత్తు సంక్షోభానికి  ఉన్న పరిశ్రమలు మూతబడి లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. కానీ ప్రభుత్వానికి పట్టలేదు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు ఎప్పుడూ కరెంటు సంక్షోభమే లేదు. అద్భుతంగా ఆలోచన చేసి కరెంటు ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత ఇచ్చి చూపించారు. కానీ ఇప్పుడున్న నిద్రపోతోంది. దాంతో ఉన్న విద్యుత్తును పొరుగు రాష్ట్రాలు పట్టుకుపోయాయి. మనం ఇప్పుడు కొందామన్నా కరెంటు దొరకదు. పైగా కిటీకిలు, తలుపులు తెరుచుకోండి గాలీ వెలుతురూ వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డిగారు చెబుతున్నారు. ఆయన ఆఫీసులో ఏసీ గదుల్లోనే ఉంటారు. ప్రజలకు మాత్రం ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారో గమనించండి!" అని ఆమె ముఖ్యమంత్రి తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్నంతా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి మూడేళ్లుగా చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు.




తాజా వీడియోలు

Back to Top