అంబేద్కర్ ఆశ‌యాల‌కు టీడీపీ తూట్లు

  • రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌న‌
  • ఓట్ల కోసం అంబేడ్క‌ర్‌ను వాడుకుంటున్న చంద్ర‌బాబు
  • సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో వివ‌క్ష‌
  • ఈ నెల 13న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో బీఆర్ అంబేడ్క‌ర్ జ‌యంతి వేడుక‌లు
విజ‌య‌వాడ‌:  రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌ దృష్టిలో సమానత్వమంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారిత. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇందుకు విరుద్దంగా రాష్ట్రంలో పాల‌న కొన‌సాగిస్తున్నారు. అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు తూట్లు పొడుస్తూ, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం గా నడుచుకుంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పచ్చకండువా కప్పుకున్న వారికి, జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతలు చెప్పిన వారికే పింఛ‌న్లు, రేష‌న్‌కార్డులు, ప‌క్కా గృహాలు కట్టబెడుతున్నారు. అన్ని అర్హతలున్న పేదలకు సొంతింటి నిర్మాణం కలగా మిగిల్చుతున్నారు. పక్కాగృహాల కేటాయింపులో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కనీసం కూడా సంప్రదించకపోవటం గమనార్హం. గ‌తేడాది అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ ప‌థ‌కాన్నిఅట్ట‌హాసంగా ప్రారంభించిన ప్ర‌భుత్వం ఇంత వ‌ర‌కు ఒక్క ఇల్లు కూడా నిర్మించ‌కుండా మోసం చేసింది. ప‌క్కాగృహాల శంకుస్థాపన రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం టీడీపీ కాల రాసింది.

ద‌ళితులకు అన్యాయం
టీడీపీ ప్రభుత్వం దళితులకు అన్యా యం చేస్తోంది. డాక్టర్ అంబేడ్కర్‌ను ఓట్ల కోసం వాడుకుంటూ... ఆ సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. పక్కాగృహాల మంజూరులో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు. ద‌ళితుల ఆర్థిక పరిస్థితిలో ఇప్పటికి మార్పుల్లేవు. 
ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీలకు మంత్రివర్గ విస్తరణలో టీడీపీ తీవ్ర అన్యాయం చేసింది. బీసీల‌ ప్రభుత్వమని చెప్పుకునే చంద్రబాబు జనాభా లో 27 శాతం ఉన్న బీసీల‌కు మంత్రి పదువులు మాత్రం అందుకు భిన్నంగా ఆరుగురికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎస్‌సి కులాలోని అన్ని ఉప కులాల వారు సుమారు 20 శాతం వరకు ఉంటే కేవలం రెండు మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిదర్శనం. రాష్ట్రంలో గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం బాధాకరం. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు త‌న వ‌ద్ద ఉన్న అవినీతి డ‌బ్బును ఎర‌గా చూపి టీడీపీలో చేర్చుకున్నారు. వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న చ‌ట్టాన్ని త‌న‌కు చుట్టంగా మ‌లుచుకున్నారు. పైగా వైయ‌స్ఆర్‌సీపీ నుంచి వ‌చ్చిన వారిలో ఇటీవ‌ల న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేశారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కాద‌ని, రాజ్యాంగ విరుద్ధంగా జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను టీడీపీ నేత‌ల‌తో ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీల‌కు పెత్త‌నం క‌ట్ట‌బెట్టారు. ఏదైనా సంక్షేమ ప‌థ‌కం అమ‌లు కావాలంటే జ‌న్మ‌భూమి క‌మిటీ సిఫార్సు కావాల‌న్న నిబంధ‌న పెట్ట‌డంతో అర్హుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన టీడీపీ అభ్య‌ర్థుల పేరుతో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధులు విడుద‌ల చేస్తూ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నారు. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా ఆలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు గిరిజ‌న స‌ల‌హా మండ‌లి ఏర్పాటు చేయ‌కుండా చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. కార‌ణం గిరిజ‌న ఎమ్మెల్యేలంతా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావ‌డంతో ఈ క‌మిటీ ఏర్పాటుపై టీడీపీ వెనుక‌డుగు వేస్తోంది.

అంబేడ్కర్‌ను స్మరించుకునే అర్హత బాబుకు ఉందా?
భారత రాజ్యాంగానికి నిత్యం తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల  విగ్రహాన్ని ప్రతిష్టించే నైతిక అర్హత ఉందా? .ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని దళితులను కించ పర్చేలా మాట్లాడటమే కాకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అసలు అంబేడ్కర్‌ను స్మరించుకునే అర్హత ఉందా?. బీసీల సంక్షేమానికి ఏటా రూ. 10,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి మూడేళ్లు అవుతున్నా..ఇంత‌వ‌ర‌కు ఐదారు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో సగం కూడా వారి కోసం ఖర్చు చేయలేదు.  
 
ఒక రోజు ముందుగానే అంబేడ్క‌ర్ జ‌యంతి వేడుక‌లు
రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ 125వ జ‌యంతి వేడుక‌లు ఒక రోజు ముందుగానే ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నిర్ణ‌యించింది. ఈ నెల 14న అంబేడ్క‌ర్ జ‌యంతి కాగా, 13వ తేదీనే వేడుక‌లు నిర్వ‌హించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు, ఇందులో పార్టీ శ్రేణులు, ద‌ళిత‌, ప్ర‌జా సంఘాల నాయ‌కులు పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
Back to Top