'బాబు నిరంతరం విదేశాలను పొగడటం సిగ్గు చేటు'

గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిది తెలుగుదేశం పార్టీయా... లేక విదేశీ పార్టీయా స్పష్టం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనల్లో రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి విదేశాలను ఇక్కడ పొగడటం సిగ్గుచేటన్నారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో బుధవారం జరిగిన పరిశ్రమల మిషన్‌లో పలు  కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, దీని ద్వారా రూ 37వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పరిశ్రమల కోసం పది లక్షల ఎకరాల భూములను అన్వేషిస్తున్నామని చంద్రబాబు చెప్పగానే రైతుల్లో ఆందోళన ప్రారంభమైందన్నారు. కేవలం ఆర్భాటపు ప్రకటనలు మినహా  కార్యరూపం దాల్చే పరిస్ధితి లేదన్నారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారేకాని ఏమీ రాని విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా పెట్టుబడులు వచ్చి ఉంటే రూ లక్ష కోట్లు పైనే ఉండేవన్నారు.

ఆయన తొమ్మిదేళ్ల పాలనలో 55వేల పరిశ్రలు మూతపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పరిశ్రమలతో చేసుకుంటున్న  ఒప్పందాలను ఎందుకు బహిర్గతం చేయటంలేదని ప్రశ్నించారు. 30వేల ఎకరాలు రాజధాని ఏర్పాటుకు తీసుకున్న క్రమంలో రైతులు కోర్టుకు వెళ్ళిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో తమని భయపెట్టి, అధికారులతో బెదిరించి భూములు లాక్కున్నారని 500 మంది రైతులు కోర్టుకు వెళితే వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విజయోత్సం చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, రుణమాఫీ అసలు ఏ రకంగా చేశారో ఒక్కసారి చెప్పాలని అంబటి కోరారు. మొదటి సంతకం రుణమాఫీపై చేస్తానని రైతులను నిలువునా వంచించారని,. కోటయ్య కమిటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటికి రైతు ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నారని, అసలు మాఫీ కాకుండా విజయోత్సవాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. మే 4, 5 తేదీల్లో పార్టీ మండల స్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని,, ధర్నాలు చేపడతామనీ, ఇందులో రాజధాని రైతులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపైనా ఉద్యమాలు ఉంటాయని తెలిపారు.
Back to Top