అవినీతి బాబు నీతులు వల్లించడం హాస్యాస్పదం

  • రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతికి బాబే కారకుడు
  • లాడెన్‌ ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఎలా ఉంటుందో.. 
  • బాబు అవినీతిపై మాట్లాడితే కూడా అలా ఉంటుంది
  • అధికారుల బదిలీలకు కూడా లంచం తీసుకుంటున్న లోకేష్‌
  • ముందు చంద్రబాబు ఆపితే.. తరువాత అధికారులు ఆపుతారు
  • రైతు దీక్ష వేదికగా ప్రభుత్వానికి చురకలంటిద్దాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టిన చంద్రబాబుకు అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో భయంకరమైన అవినీతి రాష్ట్ర నలుదిశలా వ్యాప్తిచెందిందని ఎద్దేవా చేశారు. గుంటూరు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిన్‌ లాడెన్‌ ఉగ్రవాదాన్ని అణచివేయాలని మాట్లాడితే ఎలా ఉంటుందో.. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే అలా ఉంటుందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. మేమంతా బ్రహ్మాండంగా ఉన్నామనే భావన కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరగడానికి చంద్రబాబే కారణం అనడానికి ఎలాంటి సందేహం లేదన్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం అవేవో అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడన్నారు. 

రూ. 2 వేలలో ఎమ్మెల్యేల వాటా రూ. 1500
ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తనయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు పై నుంచి కిందిస్థాయి వరకు అవినీతి సంపాదనతో కోట్లకు పడగలెత్తారని అంబటి ఆరోపించారు. చివరకు వృద్ధాప్య పెన్షన్‌ కావాలంటే జన్మభూమి కమిటీలకు రూ. 2 వేలు ఇస్తే తప్ప పనిజరగడం లేదన్నారు. జన్మభూమికి కమిటీలకు ఇచ్చే రూ. 2 వేలల్లో రూ. 15 వందలు ఎమ్మెల్యే వాటా అనే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు. రూ. 50 లక్షలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటి వరకు ఆ గొంతు నాది కాదని చెప్పలేకపోయారన్నారు. చంద్రబాబే ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడుతుంటే మేమేం తక్కువా అనే రీతిలో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల కోట్లు అర్జించారని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో హైదరాబాద్‌లో కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. కేవలం అధికారుల ఆస్తులు మాత్రమే స్వాధీనం చేసుకోవాలా.. మీ ఆస్తులు, మీ మంత్రుల ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దా అని నిలదీశారు. ఏపీలో అవినీతికి కేంద్ర బిందువుగా చంద్రబాబు తనయుడు లోకేష్‌ తయారయ్యాడని ధ్వజమెత్తారు. ఏదైనా పనికావాలంటే లోకేష్‌కు సూట్‌కేస్‌ సమర్పిస్తే టక్కున పనిజరుగుతందని ఎద్దేవా చేశారు. ఇంత పచ్చిగా అవినీతికి పాల్పడే మీరు నీతి వ్యాఖ్యలు వల్లించడం సబబు కాదని చంద్రబాబుకు హితవు పలికారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌బాబుల అవినీతిని ఆపితేనే అధికారులు కూడా ఆపగలరని సూచించారు. 

వైయస్‌ జగన్‌ దీక్షను విజయవంతం చేయాలి
గుంటూరు వేదికగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే రైతుదీక్షను విజయవంతం చేయాలని అంబటి పిలుపునిచ్చారు. మే 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు వైయస్‌ జగన్‌ దీక్ష నిర్వహిస్తున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూడలేక వైయస్ దీక్ష చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మిర్చి, పసుపు, కంది పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తే తప్ప చురుగ్గా కదిలే పరిస్థితిలో లేదన్నారు. వైయస్‌ జగన్‌ దీక్షకు ఏపీ నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు సర్కార్‌కు చురకలంటించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 
Back to Top