<strong>అనంతపురం, 29 అక్టోబర్ 2012:</strong> మంత్రి రఘువీరారెడ్డి తీరు చూస్తుంటే.. 'సొమ్మొకరిది.. సోకొకరిది' అన్న చందంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. అనంతపురం ప్రజలకు నీటి సౌకర్యం కలిగించే హంద్రీ నీవా పథకం కోసం పాదయాత్ర చేసిన పనులు పూర్తిచేస్తానని చెప్పడాన్ని షర్మిల ప్రస్తావించారు. అలాగైనా ఈ ప్రాజెక్టు పూర్తయి, అనంతపురం ప్రజలకు నీటి సౌకర్యం కలిగితే మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు.దివంగత మహానేత, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హంద్రీ నీవా పథకానికి తన హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 95 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగతా 5 శాతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేవలం 45 కోట్లు వ్యయం చేస్తే సరిపోతుందన్నారు. అయితే, ఆ కొద్దిపాటి పనులు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి మూడేళ్ళ సమయం కూడా సరిపోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రఘువీరారెడ్డి హంద్రీ నీవా పథకాన్ని పూర్తిచేస్తాననడాన్ని తమ ప్రాంతంలో 'సొమ్మొకడిది... సోకొకడిది' అంటారని అన్నారు.