26న విజయవాడకు షర్మిల పాదయాత్ర

విజయవాడ 22 మార్చి 2013:

ఈ నెల 29 నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలో సాగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు జలీల్ ఖాన్, సామినేని ఉదయభాను, గౌతం రెడ్డి పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. ఈనెల 26 మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకాశం బ్యారేజి మీదుగా శ్రీమతి షర్మిల విజయవాడలో ప్రవేశిస్తారని తెలిపారు. కెనాల్ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ చేరుకుంటారనీ అక్కడ ఏర్పాటయ్యే బహిరంగా సభలో ఆమె ప్రసంగిస్తారనీ వారు వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 26న పశ్చిమ, 27న సెంట్రల్, 28 తూర్పు విజయవాడ నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేస్తారు. మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలలో నెలరోజుల పాటు ఆమె జిల్లాలో 272 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ విధానాన్ని ఎండగడతామనీ, టీడీపీని వదిలి పెట్టబోమని వారు స్పష్టంచేశారు. ఆదివారంనాడు మంగళగిరిలో వందో రోజు పాదయాత్ర సందర్భంగా సభ నిర్వహిస్తామని వారు చెప్పారు.

Back to Top