నేడు గడ్కరీ, ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ! 

 
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అనురాగ్‌ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.   సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందచేసిన విషయం తెలిసిందే. 

ఎంపీలతో కలసి భోజనం 
 
  న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్‌ సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైయ‌స్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బాలశౌరి తదితరులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అధికార నివాసం జన్‌పథ్‌–1కి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు ఎంపీలు కలిసి మాట్లాడారు.

ప్రధాని కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ ఆమ్రపాలి కొద్దిసేపు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎంపీలతో కలిసి జన్‌పథ్‌ –1 అధికారిక నివాసంలో భోజనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ సాయంత్రం 4.15 గంటలకు లోక్‌ కల్యాణ్‌ రోడ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశం తరువాత తిరిగి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం రాత్రికి కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులున్నారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top