నాకో ప్రశ్న ఉంది, కానీ దానికో ‘లెక్కుంది’

.........తిరుపతి కాశ్యప్ 
అరె ఓ సాంబా! ప్ర‌శ్నించి చాలా రోజులైంది.ట్విట్ట‌డ‌మే కానీ మొత్త‌డం లేద‌ని జ‌నం అనుకుంటారేమో? ప‌్ర‌జ‌ల కోసం  రాజ్యం స్థాపించాల‌ని అప్ప‌డెప్పుడో పంచెలు ఊడ‌దీసి కొట్టండ‌ని చేగువేరాలా పిలుపు ఇచ్చాను. కార‌ణాంత‌రాల వ‌ల్ల కాక‌, అంత‌ర కార‌ణాల వ‌ల్ల ఎవ‌రి పంచెలు ఊడ‌దీసి కొట్ట‌మ‌న్నానో వారి పంచ‌నే త‌రువాత ప్ర‌జారాజ్యం చేరిపోయింది. దేనికైనా ఒక మూడ్ ఉండాలి, ఒక పంచ్ ఉండాలి, ఇవేవీ లేక‌పోతే ఒక పంచె అయినా ఉండాలి. తీయ‌రా సాంబా పంచె, మ్యాచింగ్ వైట్ ష‌ర్ట్ ఒక‌టి.......నిరుపేద లుక్కు వ‌చ్చిందా?

ఇక ప‌ద బ‌య‌ట డార్క్ గ్లాసుల పెద్ద కాన్వాయ్ రెడీగా ఉందా? ఒక మంత్రి అయినా, ఒక నిర్మాత అయినా కుడి ఎడ‌మ‌ల న‌డ‌వ‌డానికి రెడీగా ఉన్నారా? ఆక‌లితో అల‌మ‌టించే రైతుల గురించి మాట్లాడానికి అర్జెంటుగా బెజ‌వాడ వెళ్ళాలి. రోడ్ మార్గం లేట‌వుతుంది. రెగ్యుల‌ర్ విమానం అంటే ఫెలో ప్యాసింజ‌ర్ల‌ కోసం ఆగాలి. అస‌లే  నిరుపేద రైతులు ప్ర‌త్యేక విమాన‌మే బెట‌రు , ఎక్క‌డా పంచె న‌ల‌గ‌ కూడ‌దురోయ్‌, ముందే ఎ.సీల‌వీ స‌రిచూసుకోండి. హైద‌రాబాద్‌, గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యాల్లో మీడియా కెమెరాలుంటే ఏమీ అన‌కండి ఉండ‌క‌పోతే మాత్రం ఉండేలా చూడండి, ఒక‌రిద్ద‌రు మీడియా వారికి ఒక‌టిన్న‌ర సెక‌ను ముందే ఎక్సుక్లూజివ్ అన్న వాట‌ర్ లోగోతో వేసేసుకోడానికి వీలుగా రెండు ఫోటోలు, ప‌ది సెక‌నుల వీడియో పంపే అఫిష‌య‌ల్ లీకు ఎక్సుపర్టుని  నా కారులోనే ఉండ‌మ‌నండి
అంతా సిద్ధం..అయితే ప‌ద‌
హ‌రోం హ‌ర‌
హ‌రోం హ‌ర‌
హ‌ర హ‌ర‌
...........
క‌ట్ చేస్తే......
అరె, ఓ సాంబా! బాబుది ఎంత విన‌యంరా!
ఎంత మ‌ర్యాద‌?
మెయిన్ డోర్ ద‌గ్గ‌రికి ముందుగానే వ‌చ్చి ఎంత అందంగా రిసీవ్ చేసుకున్నాడురా? చేయి చూపించి  పీఠాధిప‌తుల‌ను లోనికి తీసుకెళ్లిన‌ట్లు ఎంత తాదాత్శ్య‌త‌రా? ఓరేయ్‌, సాంబా, అంటే అన్నారంటే కానీ, బాబు ద‌గ్గ‌ర అన్నిటికీ స‌మాధానాలున్నాయిరా. అమ‌రావ‌తి మ్యాపుల‌న్నీ చూపించాడు. ప‌నిలో ప‌నిగా బాక్స‌యిట్‌, భూతాపం, గ్లోబ‌ల్ వార్మంగ్‌,  ఉప్పాడ ద‌గ్గ‌ర భూమిని కోస్తున్న స‌ముద్రం, సెల్‌ట‌వ‌ర్ల రేడియోగ‌న్‌తో రెక్క తెగిన పిచుక‌లు, నూడుల్స్ మ్యాంగ‌నీసు మోతాదు ప‌రిమితికి మించి ఉండ‌డం, తెలుగు సంప్ర‌దాయం కాక‌పోయినా త‌మిళుల‌లా అడ్డ పంచె క‌ట్ట‌డంలో ఉన్న సౌల‌భ్యం....ఇలా ఒక‌టేమిటి? యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ ప్రిలిమ్స్‌,మెయిన్స్ ఇంట‌ర్వ్యూలో అడిగే అన్ని ప్ర‌శ్నలనూ బాబు ముందుంచాను
--------------------------
మ‌ళ్ళీ క‌ట్ చేస్తే
మ‌ధ్యాహ్నం భోజ‌నానంత‌రం - బాబు తెలుగు చానెల్స్‌
మార్చి మార్చి చూస్తున్నారు.
`` బాబు అన్నీ విన్నారు. హోదాపై మాట్లాడే హోదా నాకు లేదు. అయినా హోదా ఇవ్వ‌క‌పోతే బి.జె.పి నే  మ‌ట్టికొట్టుకుపోతుంది. నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు అయినా 2019లో పోటీలోకి దిగుతా........`` అంటూ పంచ్‌ప‌వ‌న్ మాట‌లే అక్ష‌రాలుగా బ్రేకింగులుగా,దృశ్యాలుగా, ప్యాకేజీగా ప‌దే ప‌దే వ‌స్తున్నాయి.
-----------------
బాబు ప‌డిపడి న‌వ్వుకున్నారు.
Back to Top