బుద్ధున్నవాడెవరూ పెజాసేవ చేయడట

(జేసీ ఉవాచ)
----------------------------
ప్రజల అజ్ఞానానికి..మీడియా అమాయకత్వమే కారణమని   మాజీ కాంగ్రెస్ నేత..నేటి టిడిపి ఎంపీ జే.సి.దివాకర రెడ్డి మండి పడుతున్నారు.
ప్రజలకు దిశానిర్దేశనం చేయాల్సిన  పత్రికలు..టీవీ ఛానెళ్లు ప్రజలను మరింతగా అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారన్నది జేసీ   ఆవేదన.
మనకున్న రాజకీయ నాయకుల్లో తాను నమ్మిన నిజాన్ని నిర్భయంగా..సిగ్గులేకుండా...నిర్మొహమాటంగా...చెప్పే నాయకుడు ఒక్క  దివాకర రెడ్డి ఒకరే.
ప్రజాప్రతినిథులనేవారి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని దశాబ్ధాల తన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే అయినా..ఎంపీ అయినా...చివరాఖరుకు  సర్పంచ్ అయినా సరే  అధికారంలోకి రాగానే  చేతికందినంత సంపాదించుకోడానికే చూస్తారని జేసీ అన్నారు. తనతో పాటు తన చుట్టూరా ఉన్న  అనుచర గణానికి దోచిపెడతారే తప్ప ప్రజలకు ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచన కానీ..ఉద్దేశం కానీ  ప్రజాప్రతినిథులకు అసలు ఉండనే ఉండవని కూడా ఆయన స్పష్టం చేసేశారు.
ఏదన్నా చిన్న పని జరిగితే..ప్రజలే తమ నేతలే చేశారనుకుని సంతృప్తి పడిపోతారట.
ఇక కాల్ మనీ వ్యవహారం గురించి కూడా జేసీ తనదైన శైలిలో సెలవిచ్చారు.
కాల్ మనీ వ్యాపారం ఇపుడే కొత్తగా మొదలు కాలేదని..అన్న జేసీ అసలు కాల్ మనీ వ్యాపారంలో తప్పేముందని చాలా అమాయకంగా అడిగారు.
ఎక్కువ వడ్డీ తీసుకుంటే తప్పు కానీ.. వడ్డీ వ్యాపారం చేసుకుంటే తప్పేటుందెహె అని ఆయన చాలా సీరియస్ గా నిలదీశారు.
ఇపుడు జరుగుతోన్నది. కాల్ మనీ ముసుగులో వడ్డీ వ్యాపారులు మహిళల ను లైంగికంగా వేధిస్తున్నారన్న భయంకర వాస్తవం గురించి జేసీకి నిజంగానే తెలియదా..లేక ప్రజల కన్నా కూడా ఆయన అమాయకంగా ఉంటున్నారా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు విపక్ష నేతలు.
ఇదే జేసీ ఆ మధ్య  ప్రత్యేక హోదా అనేది రానే రాదని చంద్రబాబు నాయుడితో సహా ఏపీ ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ తెలుసునని బాంబు పేల్చారు. జేసీ ఇచ్చిన షాక్ నుండి తేరుకోడానికి టిడిపి నాయకత్వానికి చాలా టైమే పట్టింది.
అవినీతి విషయంలోనూ జేసీ  చాలా సింపుల్.  అసలు అవినీతికి పాల్పడని వాడెవడన్నా ఉన్నాడా ? ఉంటాడా?  అని జేసీ  మీడియాను ప్రశ్నించారు.
చిన్న గుమస్తా నుంచి ప్రధాన మంత్రి వరకు ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత అవినీతి చేసుకోవడం చాలా చిన్న విషయమని ..దాని గురించి ఊరికే రాద్ధాంతం ఎందుకు చేస్తారంటూ మీడియాపై  మండి పడ్డారు. అంతే కాదు..మీడియా ప్రతినిథులు నారద మహర్షిలా   తంపులు పెట్టి  సంచలనాలు సృష్టించాలని చూస్తారే తప్ప వాస్తవాలను చెప్పరని సెటైర్లు కూడా వేశారు.
ముల్లు విరిగి అరిటాకు పై పడ్డా..
అరిటాకు ముల్లుపై పడ్డా..నష్టం అరిటాకుకే  కదా.
అలాగే  జేసీకి కోపం వచ్చినా..
మీడియాకు కోపం వచ్చినా కూడా..నష్టం మీడియాకే.ఎందుకంటే జేసీ ముందుగా దుమ్మెత్తి పోసేది మీడియాపైనే.
అందుకే జర్నలిస్టులు జేసీ అనగానే కాస్త...జాగ్రత్తగా ఉంటారు.
......................
-కవికాకి


Back to Top