ఫ్యాన్‌తో ప‌రేషాన్‌!

ఎన్నిక‌ల చిత్రాలు 1

మార్చి నెల ఎండ‌ల వేడి క‌న్నా ఎన్నిక‌ల వేడి చాలా ఎక్కువ‌గా ఉంది. అగ్గి ముద్ద‌లు తిన్న సూర్యుడు మంట‌లు క‌క్కుతుంటే, జ‌నాలు చెమ‌ట‌లు క‌క్కుతున్నారు. ఎవ‌రు గెలుస్తార‌న్న ఉత్కంఠ‌, వేడి త‌ట్టుకోలేని ఉక్క‌పోతా క‌లిసి తెలుగు ప్ర‌జ‌ల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నాయి. అంత‌లోనే ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చేసింది. ఇవి చేయ‌కూడ‌దు. ఇలా అన‌కూడ‌దు. ఇట్టాంటివి క‌న‌ప‌డ‌కూడ‌దు అనే ఆంక్ష‌లు మొద‌లైనాయ్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఎవ‌రు ఉల్లంఘిస్తారా ఉరికి ఉరికి కంప్లైంట్లు ఇద్దామా అని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి స‌మ‌యంలో ఆంధ్రాలోని ఓ ఊళ్లో అధికార‌పార్టీ నాయ‌కులు కొంద‌రు పార్టీ ఆఫీసులో ఏసీ గ‌దిలో కూచుని ప్ర‌చారం గురించి చ‌ర్చించుకుంటున్నారు. ఈ ఎండ‌ల్లో ప్ర‌చారం పెద్ద ప‌రేషానే అనుకుంటున్నారు చ‌ల్ల‌గాలిని ఆస్వాదిస్తూ. అలా అనుకోగానే వాళ్ల‌లో ఓ అప‌ర మేధావికి ఓ ఆలోచ‌న పుట్టింది. అంద‌రితో త‌న అమోఘ‌మైన ఆలోచ‌న చెప్పాడు. ఇంకేముందీ అనుచ‌రులంతా సై అన్నారు. కాగితాల మీద విన‌తి రాసి రెవెన్యూ ఆఫీసులో అంద‌జేసారు. ప్ర‌తిప‌క్ష పార్టీ గుర్తు ఫ్యాను క‌నుక ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఫ్యాన్లు ఉండ‌కూడ‌దు. దానివ‌ల్ల ఓట‌ర్లు ప్ర‌భావితం అవుతారు అంటూ విన‌తిప‌త్రంలో రాసిచ్చారు. ఇళ్ల‌ల్లో ఫాన్ ఉండ‌టం వ‌ల్ల సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌లు భావితం అవుతార‌ని అంద‌రిళ్ల‌లో ఫాన్లు తీసేయాల‌ని పార్టీ నుంచి ఉత్త‌ర్వులు పంపించారు. బ‌స్టాండ్లు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, షాపుల్లో ఫాన్ చూసి ప్ర‌భావితులౌతార‌ని బ‌ల‌వంతంగా పీకి ప‌క్క‌న పెట్టించారు. అది చూసిన చారుసేన సైనికులు ముందుకు ఉరికారు. అధికార‌పార్టీ సైకిల్ గుర్తు క‌నిపిస్తే ఓట‌ర్లు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉందంటూ సైకిళ్ల‌పై నిషేధం విధించాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. ఈ గొడ‌వ పై ఎన్నిక‌ల క‌మీష‌న్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంటే త‌ట‌స్థుల‌నేవారు కొంద‌రొచ్చి అన్ని పార్టీల గుర్తులూ అంద‌రు ఓట‌ర్ల‌నీ ప్ర‌భావితం చేస్తాయి క‌నుక కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన చేయికూడా చెయ్యివ్వాల్సిందే. చేతిని క‌న‌ప‌డ‌కుండా చేయాల్సిందే అని గొడ‌వ మొద‌లుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఓట‌ర్లు విప‌రీతంగా ప్ర‌భావితం అయ్యారు. ఎవ‌రికి ఓటేస్తే బావుంటుందో ఓ నిర్ణ‌యానికొచ్చేసి హాయ‌గా గాలి పీల్చుకున్నారు. 

Back to Top