కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అని ఉత్తమ్ కుమార్ ఆలోచన చేస్తున్నారు. నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ముందస్తు వ్యూహం రచిస్తున్నారు. వీలైనంత గట్టెక్కేందుకు ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. ఖర్మకాలడం ఎలాగూ ఖాయం గనుక దాన్ని ఎవరినెత్తికి రుద్దాలా అని జుట్టు పీక్కుంటున్నారు. ఉపద్రవానికి సిద్ధంగా ఉండాలని, ఉన్న కాస్త పరువుకూ తిలోదకాలివ్వాలని మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. ఇంతకీ కాంగ్రెస్ నేతల ఇంత హైరానాకు కారణం ఏమిటనుకుంటున్నారు? హుద్ హుద్ తిత్లీలను మించిన గజ తుఫాను హెచ్చరిక కాంగ్రెస్ తీరాన్ని తాకడమే. అదే చినబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారని, నేడో రేపో ప్రచారంలో పాల్గొంటారని అమరావతినించి కబురొచ్చింది. మహాకూటమితో కనీసం 30 సీట్లన్నా గెలుచుకోవాలనుకున్న ఆశ కాస్తా అందరిలో ఆవిరైపోయింది. అంతేగా మరి మాయా కూటమికి ఓటేయకండనో, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న కూటమి పేరే మహా కూటమి అనో చినబాబు ఎక్కడ నిజాలను పేలాల్లా పటపటలాడించేస్తాడా అని హడలి పోతోంది కూటమి. ఏ ప్రచారం ఎవరి కొంప ముంచుతుందో అని ప్రతి ఒక్కరూ చేతులు తలలపై సిద్ధంగా పెట్టుకున్నారు. చినబాబు ఎక్కడ పంచరేస్తే అక్కడ అతుకులేసుకునేందుకు రబ్బర్లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారం పూర్తయ్యేసరికి కూటమిలో ఎన్ని బెలూన్లకు బెజ్జాలు పడతాయో, ఎన్ని బెలూన్లు పేలిపోతాయో అని లెక్కలేసుకుంటున్నారు. మొత్తానికి చినబాబు ప్రచారం మహాకూటమికి గ్రహచారం అన్నట్టు తయారైందని చింతిస్తున్నార్ట నాయకులు.