ముఖ్యమంత్రి వక్రభాష్యం

వాట్ ఐయామ్ సేయింగ్ అని సిఎం బాబు మొదలు పెడితే ఏ ముక్కకు ఏ అర్థమో తెలియక జనం జుట్లు పీక్కుంటారు. ఆ మాదిరిగా తెలియజేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి వచ్చిందని పెద్ద నోట్ల రద్దు మీద ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఆయన మనసులో ఉన్నది నర్మగర్భంగా, వ్యంగ్యంగా, చమత్కారంగా చెబుదామని అనుకుంటారు. కానీ భాష ఆయనకు పెద్ద సమస్య. బాబు ప్రసంగ వాక్యంలో కర్త, కర్మ, క్రియ అన్వయం గురించి కొంచెం తెలుగు తెలిసిన వారెవరైనా వెతికితే తెలుగుదేశంలో తెలుగుభాషకు ఇంతగా తెగులు పట్టిందా అని గుండెలు బాదుకోవాల్సి వస్తుంది.

                  బాబు దురదృష్టం కొద్దీ టీవీ ఛానెళ్లన్నీ పోటీలు పడి ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుంటాయి. మిత్ర పత్రికల్లో అయితే ఆయన అనుగ్రహ భాషల్లో దోషాలను ఏరి, చక్కటి చిక్కటి తెలుగులో ఉత్తేజపూరితంగా ఆయన మాట్లాడినట్లు వార్తలు వస్తాయి. టీవీ మీడియాలో ఆ అవకాశం లేదు. ఆయనకే సొంతమైన తెలియజేసుకునే తెలుగు అలాగే ప్రసారమవుతుంది. డిజిటల్ టెక్నాలజీని ఇష్టపడే బాబుకు ఆయన తెలుగును లైవ్ లో సంస్కరించి చక్కటి తెలుగులా టీవీక్యాస్ట్ చేసే రియల్ టైమ్ లైవ్ తెలుగు టు తెలుగు ట్రాన్స్ లేషన్ టెక్నాలజీ రేపొద్దున వచ్చినా రావచ్చు. ఇప్పటికైతే లేదు.

                          పెద్ద నోట్లు రద్దు అని బాబు కలవరించారు. ప్రధాని ఆ కలను నిజం చేస్తూ వరమిచ్చారు. బాబు ఎగిరి గంతేశారు. హెరిటేజ్ అమ్మకం అంతా సజావుగా జరిగి, అనుకున్నట్లే అంతా సర్దుకున్నాక పెద్ద నోట్లకు కాలం చెల్లినందుకు. డిజిటల్ లావాదేవీల కోసం జాతీయ స్థాయి కమిటీకి బాబునే సారథిని చేశారు. ప్రధాని పదవినే, అప్పటికి పదో తరగతి చదువుతున్న పుత్రరత్నం లోకేష్ చెబితే జ్ఞానోదయమై వదులుకున్న బాబుకు ఆ సారథి, గీరథి పదవులు గడ్డిపోచకంటే హీనం. 

                                    రోజులు గడిచాయి. జనం బాధలు పెరిగాయి. ఆక్రోశం కట్టలు తెంచుకుంది. జనం రోడ్ల పాలయ్యారు. వెంటనే బాబు ప్లేటు మార్చారు. 40 రోజులైనా నోట్ల కష్టాలు తీరలేదంటూ మొసలి సిగ్గుపడేలా కన్నీరు కార్చారు. ఈ లోపు విషయం ఢిల్లీ దాకా వెళ్లే సరికి బాబు గజగజ వణికిపోయారు. దాంతో బాబు పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలిపారో? లేక నిరసన తెలిపారో తెలియక జనం అయోమయంలో పడ్డారు.

                                   అయితే బాబు అయోమయంలో ఉండి అలా మాట్లాడలేదు. ఏ ఎండకా గొడుగు, ఏరోటికాడ ఆ పాట సామెతలంటే బాబుకు చాలా ఇష్టం. పెద్ద నోట్ల రద్దును కోరుకునే వారికి బాబు మద్దతు తెలిపినట్లు కనపడాలి. నోట్ల రద్దుతో బాధపడేవారికి బాబు కేంద్రంతో పోరాడేవాడిగా కనపడాలి. టెక్నాలజీ కోరుకునే వారికి డిజిటల్ సారథిగా బాబు విశ్వరూప దర్శనం కావాలి. 
                                  
                                          మాటలు, సందర్భం, వీడియోలో రికార్డు కావడం లాంటి ఆధారాలుంటే "నా మాటలను మీడియా వక్రీకరించింది" అని ఒక్కమాట అంటే చాలు. బాబు అదే అన్నారు. కాకపోతే నోట్ల రద్దుకు మద్దతు, నిరసన రెండు మాటలకు "వక్రీకరణ" వర్తించేలా అన్నారు. కాపాడే మీడియా ఉంటే చాలు. వక్రీకరణ ఎన్ని వంకర్లు తిరిగినా అందంగానే జనం ముందుకు వస్తుంది. 
Back to Top