టెక్నోవంతుడు

విశాఖలో అగ్రి టెక్ సదస్సుకు బిల్ గేట్స్ విచ్చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం ప్రాధాన్యత, టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయంలో తేవాల్సిన విప్లవాత్మక మైన మార్పు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అనర్గళంగా ఉపన్యసించే అవకాశం దక్కింది. మైక్రోసాఫ్ట్ అధినేత ముందు టిడిపి అధినేత తన హైటెక్ టెక్ లను గురించి స్వయంగా చెప్పుకున్నారు. హైదరాబాద్ ను నాలెడ్జ్ హబ్ గా మార్చానని చెప్పారు. కానీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాదులోనే పరువు గబ్బుకొట్టుకు పోయిందని మాత్రం చెప్పలేదు.
 దేశం మొత్తంమీద లాప్ టాప్ తో ప్రజెంటేషన్ ఇచ్చిన తొలి రాజకీయనేత తానే అని కూడా జబ్బలు చరిచి మరీ చెప్పుకున్నాడు చంద్రబాబు. కానీ ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీని అల్లిబిల్లిగా నడిపించేస్తున్నానని చెప్పనేలేదు. 

వైద్య ఆరోగ్య రంగంలో బిల్ గేట్స్ స్థాపించిన బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు బాబు. అయితే అటు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలను కొనుక్కొచ్చుకొని ఎప్పుడూ పక్కవాళ్ల సహకారంతోనే ఈ పోస్టులో ఉన్నానని గుర్తించటం లేదు. 
బాబుగారి భాజా భజంత్రీలు విన్న తర్వాత బిల్ గేట్స్ సూటిగా కొన్ని విషయాలు సిఎమ్ బుర్రకెక్కేలా చెప్పారు.
 దేశంలో సగం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. చిన్న, సన్నకారు రైతులు అభివృద్ధి చెందితేనే వ్యవసాయరంగం బాగుంటుందన్నారు. శాస్త్ర, సాంకేతికత చిన్న రైతులకు అందుబాటులో ఉంటేనే వారు మంచి సాగు చేయగలుగుతారు. నష్టపోకుండా ఉంటారని వివరించారు. అమెరికా, యూరప్ లలో వేల రకాల విత్తనాలు ఉత్పత్తి చేసినా అందులో అత్యుత్తమమైన వాటినే రైతులకు అందిస్తారని చంద్రబాబుకు చురకంటించారు. ఇక్కడ మాత్రం విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తానాలు రైతులకు అందించడం లేదని, అందుకు పాలకులు శ్రద్ధ కనబరచాలని సూచించారు. భూసార పరీక్షలతో ఏ పొలంలో ఏ పంట వేయాలి, ఎరువులు ఎంత వాడాలి, పెట్టుబడి ఖర్చు ఎంత అనే వివరాలు తెలుసుకోవడం ద్వారా రైతులు నష్టపోకుండా ఉంటరాని చెప్పారు. 

నిక్షేపంలా మూడు పంటలు పండే భూమిని రాజధాని పేరిట సేకరించి, గుత్తంగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న సంగతి తెలిస్తే బిల్ గేట్స్ ఎపి వైపు కన్నెత్తైనా చూస్తాడా! వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు కమీషన్ల కక్కుర్తితో కాలయాపన చేస్తున్నారని అర్థం అయితే తమ ఫౌండేషన్ నుంచి సహకారం అందిస్తాడా? రుణమాఫీ పేరుతో కుచ్చుటోపీ పెడుతున్నారని, మద్దతు ధర ఇవ్వకుండా రైతుల కడుపు కొడుతున్నారనే నిజాలు తెలిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంత కాలం ఎపిలో వ్యవసాయానికి ఏసాయం చేయడం సాధ్యం కాదని బిల్ గేట్స్ కు అర్థం అయి ఉండేది. కానీ బాబు మాయాజాలం ముందు ఆ వాస్తవాలు ఎవరికి కనిపిస్తాయి కనుక.

అరచేతిలో రిమోట్ తో ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని, అభివృద్ధి అందలం ఎక్కుతోందని, అందరూ సంతోషంగా ఉన్నారని తెరమీద సినిమా చూపించారు చంద్రబాబు. అయితే బాబు ఒక్క విషయం మర్చిపోకూడదు…లాప్ టాప్ యూజ్ చేస్తేనో, పవర్ పాయింట్ తో గ్రాఫులు, అంకెల గారడీ చేస్తేనో రాష్ట్రం అభివృద్ధి చెందదు. పచ్చ కండువాలు కప్పుకున్న పెత్తందారు రైతులను సింగపూరు ట్రిప్పుకు పంపిస్తే వ్యవసాయం బాగు పడదు. రైతుకు కష్టం లేకుండా చూడాలి. విత్తనాల నుంచి, ఎరువుల వరకూ, రుణాల నుంచి, పంట బీమా వరకూ రైతుకు అండగా నిలిస్తేనే అన్న పూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ ఆ పేరును సార్ధకం చేసుకోగలుగుతుంది. లేకపోతే ఇదిగో బాబుగారి ఆర్భాటాల సమ్మెట్ లకూ, సదస్సులకూ మాత్రమే వేదికగా నిలుస్తుంది. 


Back to Top