2019లో ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ బూతుల వద్ద జనం బారులు తీరారు. ఏ పార్టీకి ఎంత మెజారిటీ రావచ్చు, ఎక్కడ పోలింగ్ సంపూర్ణంగా జరుగుతోంది, ఎక్కడ పాక్షికంగా ఉందని అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. అంతలోనే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ మెదలైంది. కనీ వినని వింతలు ఎపి ఎన్నికల్లో జరుగుతున్నాయని టీవీ ఛానెళ్లు హోరెత్తుతున్నాయి. ఓ పోలింగ్ బూత్ లో 3 సంవత్సరాల పాప ఓటు వేసిందని ఓ కథనం. ఇదెలా సాధ్యమబ్బా అంటూ అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతుంటే అంతలోనే మరో వార్త. ఆ పాప భర్తకు కూడా ఓటరు గుర్తింపు కార్డు ఉందని, అతడు మరి కాసేపట్లో వాళ్లమ్మ చంకమీద ఎక్కి వచ్చి మరీ ఓటేస్తాడని. ఈ కథనం గురించి చర్చలు జరుగుతుండగానే మరో షాకింగ్ షేకింగ్ న్యూస్. 335 ఏళ్ల వ్యక్తి ఒకరు వచ్చి ఓటు వేస్తానంటున్నాడని పోలింగ్ బూత్ అధికారులు తెలియజేస్తున్నారు. దానిపై పూర్తి సమాచారం తెలుసుకునేలోపే అంతరిక్షం నుంచి వచ్చిన కొందరు ఓటు వేసేందుకు అమరావతిలోని 14వ పోలింగ్ బూతులో లైనులో నుంచున్నారని రిపోర్టలు చెబుతున్నారు. వారివద్ద ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉందని చెబుతున్నారు. ఎపిలో ఏదైనా జరగచ్చు. చంటిపిల్లలు చంద్రబాబు కథలు చందమామ కథల్లా వినొచ్చు. స్కూలు పిల్లలు సరదగా వచ్చి ఓట్లు వేయొచ్చు. ఉన్న వోట్లను మంత్రదండం లేకుండానే మాయం చేయొచ్చు. ట్విన్ బ్రదర్స లాగా ఒకే మనిషికి రెండు చోట్ల ఓటు ఉండొచ్చు. అవిభక్త కవలల్లాగా ఒకే నెంబర్ పై ఇద్దరికి ఓటు ఉండచ్చు. శాతవాహన చక్రవర్తికి ఓటు ఉండొచ్చు. అలెగ్జాండర్ అమ్ముమ్మకు ఓటు ఉండొచ్చు. అధికారపార్టీపై అభిమానం ఉంటే చంద్రమండలం నుంచో అంగారక గ్రహం నుంచో వచ్చిన గ్రహాంతర వాసులు కూడా ఓటు హక్కు ఉండచ్చు. ఓటు ఎవరికైనా ఉండొచ్చు. ఎన్ని అయినా ఉండచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. చివరగా కావాల్సిన ఫలితం మాత్రం పచ్చగా ఉండాలి. పచ్చజెండా ఎగిరేలా ఉండాలి. ఈ టార్గెట్ తో అధికారపార్టీ పనిచేసిన ఫలితమే ఇదని తెలిసేసరికి పోలింగ్ పూర్తి అయ్యింది. ఇక ఓట్ల లెక్కింపుకు కాస్త సమయం ఉండటంతో ఇలా ఓట్లు వేసిన వారిని ప్రశ్నించాయి పత్రికలు, ఛానెళ్లు. దానికి వారందరి మూకుమ్మడి సమాధానం ఏమిటంటే ఏ కారణంతో మాకు ఓటు దొరికిందో తెలియదు కానీ, దొరికిన ఓటును సార్థకం చేసుకునేందుకు, ఓటుకు నోటు ఇచ్చే చరిత్రను చెరిపేసేందుకు, ఓటుకు విశ్వసనీయతను కాపాడేందుకు మేము ఈ ఓటును ఉపయోగించుకున్నాం అని.