మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు? 

కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్న

నెలకు రూ.1,500, ఫ్రీ బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఎప్పుడిస్తారు?

2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి ఏ హామీనీ నిలబెట్టుకోలేదు

ఇప్పుడూ అదే బాటలో వెళ్తారా అని మహిళలు ఆందోళనలో ఉన్నారు

జగనన్న అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన వచ్చేవి

జగనన్న సిద్ధం చేసి ఉంచిన ఆసరా డబ్బులూ మహిళలకు పడలేదు

రెడ్ బుక్‌ల మీద పెట్టిన శ్రద్ధ హామీల అమలుపై చూపండి

కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు

విశాఖపట్నం:  కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. 

హామీల అమలుకు కార్యాచరణ ఏదీ? 
జగనన్న అమలు చేసిన పథకాలు, హామీల కంటే కూటమి నేతలు ఎక్కువ ఇస్తామని హామీ ఇస్తే ప్రజలు నమ్మి ఓట్లేశారని వరుదు కళ్యాణి అన్నారు. ఏడాదిన్నర ముందే చంద్రబాబు సూపర్ సిక్స్ అని పథకాలు మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. మహిళలు నమ్మరేమో అని బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బాండ్ పేపర్లు కూడా ఇచ్చి నమ్మించారన్నారు. జగనన్న 99 శాతం హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచం ఎక్కువ ఇస్తామని చెప్పారనే కారణంతో వాళ్లను నమ్మి ఓట్లేశారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారాలు అయ్యి నెల కావస్తోందని, ఈ పరిస్థితుల్లో మహిళల కోసం ఇచ్చిన హామీల అమలుకు ఇంత వరకు శ్రీకారం చుట్టలేదన్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. తాము అడిగితే నెల రోజులే అయ్యిందని, ఎందుకు తొందర అంటున్నారన్నారు. కానీ కూటమి హామీ ఇచ్చినప్పుడు జూలై 1కే అన్నీ అమల్లోకి వచ్చేస్తాయని, మొదటి నెల నుంచే అమలు చేసేస్తామని చెప్పారన్నారు. 

2014లో ఇవే హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చారా?
ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా హామీలిచ్చారని, ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. మహిళలకు డ్వాక్రా రుణ మాఫీ చేయలేదన్నారు. సున్నా వడ్డీ 2016 నుంచి ఆపేశారన్నారు. డ్వాక్రా సంఘాలు ఎన్‌పీఏలుగా మారిపోయిన పరిస్థితిని ఆరోజుల్లో చూశామన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. సొంతింటి కల ఆడవాళ్లకు నెరవేరుస్తామని హామీ నిలబెట్టుకోలేదన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని నెరవేర్చలేదన్నారు. అప్పుడు ఇలా హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇప్పుడు చూస్తే నెల కావస్తున్నా అతీగతీ లేదన్నారు. 

రూ.1,500 ఎప్పుడిస్తారు?
18-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని, ఇప్పటికే నెల రోజులు గడిచిపోయిందన్నారు. రాష్ట్రంలో మొత్తం మహిళల్లో పెన్షన్ దారులను తీసివేస్తే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1.72 కోట్ల మంది ఉన్నారన్నారు. మరి దీని కోసం మీరేమైనా నిధులు కేటాయించారా? కనీసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఇంత వరకు ఏమీ చేయలేదన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందా? లేదా? అని అందరికీ అనుమానం కలుగుతోందన్నారు. అర్జెంటుగా నెలకు రూ.1500 విడుదల చేసి మహిళలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను, మిగతా మంత్రులను కోరుతున్నామన్నారు. 

జగనన్న అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే సాయం అందేది
గతంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, సంతృప్త స్థాయిలో పెన్షన్లు అన్నీ ఠంచనుగా తేదీ ప్రకటించిన మరీ ఇచ్చారన్నారు. మా జగనన్న ప్రభుత్వం చివర్లో చేయూత కోసం రూ.4 వేల కోట్లు సిద్ధం చేసి ఉంచారని, కానీ చేయూత డబ్బులు ఏ మహిళకూ పడని పరిస్థితి ఉందన్నారు. మహిళలందరూ చేయూత పడలేదని బాధపడుతున్నారన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ పాటికే డబ్బులు వచ్చేసి ఉండేవన్నారు. జగనన్న ఇప్పటికే డబ్బులు సమకూర్చి పెట్టిన చేయూత డబ్బులు కూడా వెంటనే మహిళల ఖాతాల్లో వేయాలని కోరుతున్నామన్నారు. తమ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కింద 2019-20 నుంచి ఏటా క్రమం తప్పకుండా ఠంచనుగా జగనన్న ఇస్తూ వచ్చారన్నారు. 44.5 లక్షల మంది మహిళలకు రూ.25,809 కోట్లు ఠంచనుగా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఇచ్చారని గుర్తు చేశారు. కాలేజీలు ప్రారంభం అయిపోయాయని, ఫీజులు చెల్లించాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు దానికి కూడా అప్పులు చేస్తున్నారని, విద్యాదీవెన, వసతి దీవెన వెంటనే విడుదల చేయాలన్నారు. 

స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఎప్పుడిస్తారు?
స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. అంటే దాదాపు రాష్ట్రంలో కోటి మందికి పైగా స్కూలుకు వెళ్తున్న పిల్లలున్నారన్నారు. వాళ్లందరికీ రూ.15 వేలు ఇస్తామన్నారన్నారు. మహిళలందరూ చాలా ఆశపడ్డారన్నారు. కానీ ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ చేయలేదన్నారు. కోటి మందికి రూ.15 వేల చొప్పున రూ.15 వేల కోట్లు ఈ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే స్కూళ్లు ప్రారంభమయ్యాయని, పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారని, ప్రయివేటు స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు ఫీజులు కట్టాలని యాజమాన్యాలు అడుగుతున్నాయన్నారు. డబ్బులు ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదని మహిళలు ఆందోళన చెందుతున్నారన్నారు. జగనన్న మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా జూన్ లోనే ఆ డబ్బులు వేసి ఉండేవారన్నారు. 

సాయం అందక రైతన్న అప్పులపాలు 
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.13,500 రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైచిలుకు  రైతుల ఖాతాల్లో వేసేవారన్నారు. చంద్రబాబు కూటమి హామీల్లో ఏటా రూ.20 వేలు రైతులకు ఇస్తామని చెప్పారన్నారు. తమకు చాలా ఉపయోగపడుతుందని రైతులందరూ నమ్మి ఓట్లేశారన్నారు. అందులో ఎంతో మంది మహిళా రైతులు కూడా ఉన్నారన్నారు. ఖరీఫ్ ప్రారంభమైపోయింది, రైతులకు పెట్టుబడి సాయం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఇదే కూటమి 2014లో రైతు రుణ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిందని, కానీ చేయలేదన్నారు. ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని రైతాంగం ఎదురు చూస్తూ బాధపడుతున్నారన్నారు. రూ.10, రూ.20 వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి విత్తనాలు చల్లుతున్నారని, ప్రభుత్వ సాయం ఇంకా అందకపోవడంతో అప్పులు చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నామన్నారు. 

3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్ ప్రయాణంపై కార్యాచరణ ఏదీ?
ప్రతి మహిళకీ ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి నేతలు చెప్పారన్నారు. అదెప్పుడిస్తారో అని మహిళలందరూ ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో సగం మంది అంటే 2.5 కోట్ల మంది మహిళలున్నారని, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు చెప్పారన్నారు. పక్క రాష్ట్రాల్లో మాదిరిగా మనం కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని సంతోషించి మహిళలందరూ ఓట్లేశారన్నారు. కానీ అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో దానికి తేదీ గానీ, మార్గదర్శకాలు కానీ, సన్నాహక సమావేశం గానీ ఏర్పాటు చేయలేదన్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగభృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పారని, అది ఎప్పటి నుంచి ఇస్తారో అని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇవన్నీ నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలని, తేదీలు ప్రకటించి నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 

కక్షసాధింపులపైనే మీ దృష్టి
ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ఎక్కడ చూసినా విధ్వంసాలు, దాడులు కనిపిస్తున్నాయన్నారు. మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కోరుకుంటున్నారని వ‌రుదు క‌ళ్యాణి పేర్కొన్నారు. 

Back to Top