చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ మండిపడ్డారు. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యానికి అంతు లేకుండా పోయిందని, అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటనను భరత్ తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన సీఎం ఇలాకాలో చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఏమన్నారంటే.. `కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీ కార్యకర్త ఒక మహిళను సభ్యసమాజం సిగ్గుపడేలా చెట్టుకు కట్టేయడం అత్యంత హేయమైన చర్య, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణం, టీడీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో అనేక దారుణాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు, అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్, ప్రభుత్వ పెద్దలే వైయస్ఆర్‌సీపీ వారికి ఎవరూ ఎలాంటి పనులు చేయద్దని చెబుతుంటే టీడీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా దారుణాలు, దుర్మార్గాలు చేస్తున్నారు, కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ, బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, అడ్డూఅదుపు లేకుండా అక్రమ మైనింగ్, రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. రెండు సరిహద్దు రాష్ట్రాలకు అక్రమ తరలింపులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సామాన్య ప్రజలను అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతుంటే పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు, బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు, ఇలా గొంతు నొక్కే ప్రయత్నాలను తీవ్రంగా ఎదుర్కొంటాం, బాధితుల పక్షాన పోరాడుతాము` భరత్ స్పష్టం చేశారు.