పవన్‌ టీడీపీకి మద్దతివ్వ‌డాన్ని కాపు సామాజిక వర్గం హర్షించదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌

ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తే సరిచేసుకుంటాం

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకి మద్దతివ్వడాన్నికాపు సామాజిక వర్గం హర్షించదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ïసీపీ కి భావజాలం లేదంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్‌ తీవ్రంగా ఖండించారు.  వైయస్‌ఆర్‌సీపీ అంటే దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనకు కొనసాగింపు అని ఉద్ఘాటించారు. జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది. టీడీపీకి మేలు చేసేందుకు పవన్‌ అసత్యాలు మాట్లాడుతున్నారు. 2014–2019 మధ్యలో ఎలాంటి పాలన జరిగిందో, ఇప్పుడు ఎలాంటి పాలన జరుగుతుందో పోల్చుతూవైయస్‌ఆర్‌సీపీని విధానపరంగా వ్యతిరేకించాలన్నారు. కానీ ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ లైన్‌ దాటి మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి, వెంకటేశ్వరరావే రెండు సందర్భాల్లో టీడీపీని వ్యతిరేకించారు. అందుకే కదా ఇవాళ మీరు బీజేపీలో ఉన్నారని గుర్తు చేశారు.  ఇవాళ  పురంధేశ్వరి తీరును ఎవరూ కూడా ఒప్పుకోవడం లేదన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏమ‌న్నారంటే..

పవన్ వింతైన వ్యవహారంః
వైయ‌స్‌ఆర్‌సీపీ అనేది దివంగత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి పరిపాలనకు కొనసాగింపు. ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ల నాలుగునెలలపాటు నడిపించిన ప్రభుత్వ పరిపాలన.. అభివృద్ధి, సంక్షేమాన్ని శాచురేషన్‌ పద్ధతిలో నడిపించిన విధానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. అలాంటి మహానేత హఠాన్మరణంతో వారి ఆశయాల్ని కొనసాగించేందుకు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ. ఇందులో ఎవరికీ అనుమానం, అపోహలుండాల్సిన పనిలేదు. అటువంటి మా పార్టీ గురించి, అసలు సిద్ధాంతమే లేని పార్టీనేతలు మాట్లాడటం అనేది చాలా వింతైన వ్యవహారం. పవన్‌కళ్యాణ్‌ వైయ‌స్‌ఆర్‌సీపీ పై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. దీన్నిబట్టి ఆయనకు రాజకీయ అవగాహన ఇంకా అవసరమని చెప్పాలి. 

పవన్‌కు దూరమైన జనసేన కేడర్ః
పవన్‌కళ్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీని ఎప్పుడైతే టీడీపీతో కలిసి విస్తృతంగా పనిచేయాలని చెప్పాడో.. ఆనాడే ఆపార్టీ పతనం మొదలైంది. అప్పటివరకూ జనసేన పార్టీకి పనిచేసిన కాపు సామాజికవర్గ నేతలతో గానీ.. ఇన్నాళ్లూ ఆ పార్టీ భావజాలం నచ్చి పనిచేసిన కీలక నేతలతో గానీ ఎలాంటి సంప్రదింపులు, చర్చలు చేయకుండా రాత్రికి రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకెళ్లి చంద్రబాబును కలిసి సపోర్టు చేస్తానని పవన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఏ రోజైతే పవన్‌కళ్యాణ్‌ టీడీపీకి తోడుగా ఉంటానని.. చంద్రబాబుకు మద్దతిస్తానని రాజమండ్రిలో చెప్పినప్పుడే.. జనసేన కోర్‌ కమిటీతో పాటు ఆ పార్టీ భావజాలం నచ్చి పనిచేసిన వారి మద్ధతును కోల్పోయాడు. ఈ మాట నేనన్నది కాదు. నిన్న స్వయంగా పవన్‌కళ్యాణ్‌ మాటల్లోనే కనిపిస్తున్న నిజం. ‘నన్ను మోదీ అర్ధం చేసుకున్నప్పటికీ, పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవడంలేదని పవన్‌కళ్యాణ్‌ నిన్న తమ కేడర్‌ను సముదాయించే ప్రయత్నం చేశాడు. తన మాటల్లో అక్కడక్కడా కేడర్‌కు హెచ్చరికలు కూడా చేస్తున్నాడంటే.. తాను తీసుకున్న నిర్ణయానికి, తన పార్టీ వ్యవస్థ భిన్నంగా ఉందనేది పవన్‌కళ్యాణ్‌కూ తెలిసిపోయింది. జనసైనికులు, ఇన్నాళ్లూ కిందిస్థాయిలో తనకు మద్ధతిచ్చిన వర్గమంతా ఈరోజు దూరమైపోతుందనే ఆందోళన పవన్ కల్యాణ్ తన మాటల ద్వారా వ్యక్తపరిచాడు. 

చంద్రబాబును అధికారంలోకి తేవడమే పవన్‌కళ్యాణ్‌ లక్ష్యంః
ఒక రాజకీయ పార్టీగా ఉన్న జనసేన మరో రాజకీయపార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ, పొత్తు పెట్టుకోవడానికి ఏర్పడిన పరిస్థితుల గురించి విస్తృతంగా చర్చలు జరిపి సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత, ధర్మం ఆయా రాజకీయ పార్టీల అధినేతలకు ఉంటుంది. మరి జనసేన, టీడీపీ మధ్య పొత్తు అనేది ఇద్దరు వ్యక్తులు తీసుకున్న నిర్ణయంగానే ఉంది తప్ప ఆయాపార్టీల్లో ఏ ఒక్క కోర్‌కమిటీ నేతలతో కలిసి చర్చించుకున్న దాఖలాలు లేవు. రాజకీయ పార్టీలను అంటిపెట్టుకుని కొన్ని వర్గాలు ఓన్‌ చేసుకుని పనిచేస్తాయన్నది బహిరంగ రహస్యం. అలాంటిది, పవన్‌కళ్యాణ్‌ జనసేన పెట్టినప్పుడు దాన్ని వేదికగా తీసుకుని పనిచేసిన కాపుకులస్తులకు, టీడీపీని ఓన్‌ చేసుకున్న వర్గానికి నడుమ సామాజిక వర్గ భావజాల వ్యత్యాసం చాలా ఉంది. కాపుకులానికి టీడీపీ వర్గానికి గతంలో అనేక రకాలైన సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తమతో వైరం పెట్టుకున్న వర్గంతోనే కలిసి పనిచేయాలని కేడర్‌కు హుకుం జారీచేయడం బెడిసికొట్టిన అంశంగా తయారైంది. జనసేన, టీడీపీ పొత్తు అనేది ఖచ్చితంగా టీడీపీకి లాభం చేకూర్చే నిర్ణయమే గానీ.. జనసేన ఎదుగుదలకు ఏమాత్రం పనిచేయదని చిన్నపిల్లోడైనా చెబుతున్నాడు. దీన్నిబట్టి చూస్తే జనసేన పార్టీ సిద్ధాంతం లేని పార్టీ అని చెప్పాలి. కేవలం, చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు మాత్రమే పవన్‌కళ్యాణ్‌ పనిచేస్తాడని.. అందుకోసం తన పార్టీని, తనను నమ్ముకున్న కులస్తుల్ని సైతం అమ్మడానికి సిద్ధపడతాడనేది స్పష్టమౌతున్న అంశం. 

బాబు కోసమైతే పార్టీ ఎందుకు పెట్టావ్..?
టీడీపీని అధికారంలోకి తెచ్చి చంద్రబాబుకు పరిపాలనా పగ్గాలు అప్పగించేందుకే పవన్‌కళ్యాణ్‌ పనిచేసేటట్లయితే, మరి.. జనసేన అనే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడం ఎందుకు..? చంద్రబాబు సొంత సామాజికవర్గం బలపడటానికే పనిచేయాలని మీరు భావించినప్పుడు జనసేన పేరిట ఒక మెజార్టీ సామాజికవర్గ బలాన్ని కూడగట్టాలనుకోవడం ఎందుకు..? అని ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే భిన్నమైన భావజాలంతో జనసేన పార్టీ పనిచేస్తుందనే మాటతో మీరు పార్టీ పెట్టారు కదా..? మరి, ఆ మాటకు మీరు న్యాయం చేస్తున్నారా..లేదా..? అనేది పవన్ కళ్యాణ్‌ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

జగన్‌ గారి పేరెత్తే అర్హత పవన్‌కు లేదుః
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును కూడా ఉచ్ఛరించే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదు. మా నాయకులు జగన్‌ గారు ముఖ్యమంత్రి అవుతారా..లేదా..? అనేది చెప్పడానికి పవన్‌కళ్యాణ్‌ ఎవరు..? వైయ‌స్‌ఆర్‌సీపీని అన్నింటా ఆదరించే ప్రజలు నిర్ణయించే అంశాన్ని ఆయనెలా చెబుతాడు..? జనసేనలా వైఎస్‌ఆర్‌సీపీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎన్నికల్లో సింగిల్‌గానే పోరాడి విజయం సాధిస్తుంది. వైయ‌స్ జగన్‌ గారి నాయకత్వంలో నాలుగేళ్ల ఎనిమిదినెలల కాలంలో జరిగిన పరిపాలన ఎలా జరుగుతుందనేది.. కోవిడ్, తీవ్రమైన ఆర్థికసంక్షోభంలోనూ సంక్షేమాన్ని ప్రజలకు ఏమేరకు అందిస్తున్నారనేది ఊరూరా అంగీకరిస్తున్న విషయం. 

తన వ్యాఖ్యలకు పవన్ సిగ్గుపడాలి
ఒకవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంస్కరణల్లోనూ జగన్‌గారి ఆలోచనావిధానానికి దేశంలోనే గుర్తింపు లభిస్తోంది. నాడు–నేడు పేరిట ప్రభుత్వ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తేవడం, హార్బర్లు, పోర్టుల నిర్మాణం, ఐటీ కంపెనీలతో పాటు పెద్దపెద్ద పరిశ్రమలను తేవడం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, రైతుభరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వాన్ని ఇంటి గడపలోకి తేవడం అనేది అందరూ అంగీకరించాల్సిన సుభిక్షమైన పరిపాలన ఇది. ఈ స్థాయిలో పెద్ద ఎత్తున పరిపాలనా సంస్కరణలు తెచ్చి అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి జగన్‌ గారి పార్టీకి భావజాలం లేదని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడటాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సిగ్గుపడాలి. ఆయన ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో మార్పులను అవగతం చేసుకుని  వైయ‌స్‌ఆర్‌సీపీపై, వైయ‌స్ జగన్‌ గారిపై మాట్లాడిన మాటల్ని విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నాను.  

రాజకీయాల్ని బంధుత్వంతో ముడిపెట్టడమా?
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఒక జాతీయపార్టీ నేత హోదాలోనే మాట్లాడాలి. అంతేగానీ, ఆమె మాట్లాడుతున్న చిల్లర మాటలతో రాజకీయంగా ఆమెకు ఎదుగుదల ఉండదు. మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఏమని మాట్లాడారో.. ఎలా విమర్శించారో ప్రజలు మరిచిపోలేరు. ఎందుకంటే, ఆనాడు మీ నోట వినిపించిన నిజాలు ఎప్పటికీ ప్రజల మెదళ్లలో నిలిచిపోతాయి. అలాగే, స్వయంగా మీ భర్త డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారంటే.. మీ కుటుంబం ప్రత్యక్షంగానే టీడీపీని పూర్తిగా వ్యతిరేకించినట్టే కదా..? ఇప్పుడు బీజేపీలో ఉండి మీరు భిన్నంగా వ్యవహరిస్తూ చంద్రబాబు మీద ఏ ఒక్క విమర్శ చేయకుండా పనిగట్టుకుని  వైయ‌స్‌ఆర్‌సీపీ  ప్రభుత్వంపైనే విమర్శలకు పాల్పడటం చాలా దుర్మార్గమైన విషయం. మీ మాటల్ని బట్టి మీ వైఖరేంటో.. మీ రాజకీయ భావజాలమేంటో అనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీని విధానపరంగా పురంధేశ్వరి తప్పుబట్టడితే సమాధానం చెబుతాం. కానీ,  2014 –19లో చంద్రబాబు ప్రభుత్వానికి - ఇప్పటి వైయ‌స్ జగన్ గారి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను బేరీజువేసి మాట్లాడితే బాగుంటుందేమో గానీ.. చంద్రబాబును మదిలో పెట్టుకుని జగన్‌గారి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పూనుకోవడం దారుణమైన తప్పుగా ప్రజలు భావిస్తున్నారు. కనుక, ఇప్పటికైనా ఆమె వైయ‌స్‌ఆర్‌సీపీ  ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. 

బాబు సచ్ఛీలుడని బెయిల్ ఇవ్వలేదుః
అవినీతికి పాల్పడి ఆధారాలతో అడ్డంగా దొరికి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు తన రోగాల్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టుకుని మాత్రమే బెయిల్‌ పొంది బయటకొచ్చాడు. అంతేగానీ, అతను సచ్ఛీలుడైతే కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలినని చెప్పుకునే చంద్రబాబు తనపై మోపిన అభియోగాల్ని న్యాయస్థానాల్లో నిరూపించుకుని ప్రజల మధ్యకు రావాలి గానీ.. వందల రోగాలున్నాయంటూ.. అంబులెన్స్‌లను వెంట తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ..  తప్పుడు వైద్యరిపోర్టులతో బెయిల్‌ పొందడమనేది సిగ్గుమాలిన చర్యగా అందరూ భావిస్తున్నారు. ఇక, తాను బెయిల్‌పై వైద్య చికిత్స చేయించుకుంటూ ఇంట్లో ఉండి కూడా తన పార్టీని వదిలి అత్యంత నిగూఢంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టు చేశారనేది అందరూ చర్చించుకుంటున్న విషయం. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి... అని ఆమంచి కృష్ణమోహన్ హితవు చెప్పారు.  

తాజా వీడియోలు

Back to Top