ప్రైవేటీక‌ర‌ణ‌పై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగ‌దు

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ పశ్చిమలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం 

విజ‌య‌వాడ‌:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కూట‌మి ప్ర‌భుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగ‌ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు హెచ్చ‌రించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్ సాయిరామ్ సెంటర్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం రచ్చబండతో పాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాయన నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి , పశ్చిమ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. “మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగితేనే పేద ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది” అని స్పష్టం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనే లక్ష్యంతో 17 కాలేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. వైయ‌స్ జగన్ హయాంలోనే ఐదు కాలేజీలు పూర్తిగా నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగిందని, ఎన్నికల కోడ్‌ సమయంలో మరిన్ని రెండు కాలేజీలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన కాలేజీలు వివిధ దశల్లో కొనసాగుతున్నప్పుడే, వాటిని ప్రైవేటీకరణ పేరుతో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బదలాయించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం అన్యాయమన్నారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవ‌డానికి కూట‌మి ప్రభుత్వం నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని వెలంపల్లి శ్రీనివాసరావు విమ‌ర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయని అన్నారు. ప్రజా ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రైవేటు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేసేంత వరకు వైయ‌స్ఆర్‌సీపీ తరపున పోరాటం ఆగదు” అని వెలంపల్లి హెచ్చరించారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని కోటి సంతకాల దాకా విస్తరించి, ప్రభుత్వాన్ని వెనక్కు తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ అయుతా కిషోర్, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top