రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం

పోలవరం, విశాఖ జోన్‌ విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

పార్లమెంట్‌లోనూ టీడీపీ ఎంపీల స్వార్థ రాజకీయం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ధ్వజం

న్యూఢిల్లీ క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  పార్లమెంట్‌ సభ్యులు.

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా కేంద్రంతో రాజీపడ్డ చంద్రబాబు

పోలవరం రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది

బనకచర్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరెలా అందిస్తారు?

సూటిగా ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలు

వాల్తేరు డివిజన్‌ మొత్తాన్ని విశాఖ రైల్వే జోన్‌ పరిధిలో ఉంచాలి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయించాలి

విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలి

ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల డిమాండ్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంట్‌ సభ్యులు మండిపడ్డారు. న్యూఢిల్లీలో మంగళవారం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డితో పాటు ఎంపీలు పీవీ మిధున్‌ రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వైయస్‌ అవినాశ్‌ రెడ్డి, ఎం.గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్‌ అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి చేద్దామని ఎన్నిసార్లు కోరినా తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో వ్యవహరించిందని ధ్వజమెత్తారు.

అమరావతి కోసమే బాబు ఆ రాజీ:
    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో చాలా స్పష్టంగా పోలవరం ఎత్తును, నీటి నిల్వ సామర్థ్యాన్ని కుదించి దానికి అనుగుణంగా నిధులు  కేటాయిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి పోలవరంకు ప్రాజెక్ట్‌ 45.75 మీటర్ల ఎత్తుతో 196 టీఎంసీల సామర్థ్యంలో నిర్మాణం పూర్తి చేయాలి. ఇందుకోసం మొత్తం రూ.57 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే తాజా బడ్జెట్‌ సమావేశాల్లో పోలవరం ఎత్తు తగ్గించి 41.5 మీటర్లకు కుదించి కేవలం 115 టీఎంసీల సామర్థ్యానికి పరిమితం చేస్తున్నామని, దీనికి గానూ కేవలం రూ.30 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే కేంద్రం నుంచి రావాల్సిన రూ.27 వేల కోట్ల గ్రాంట్‌ను రాష్ట్రం కోల్పోయింది. అమరావతికి రూ.15 వేల కోట్ల అప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ పడి ఇంత పెద్ద గ్రాంట్‌ను వదులుకున్నారు.

రాష్ట్ర జీవనాడి దెబ్బ తింటుంది:
    పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు పోలవరం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తే, చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను కుదించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. దీనిని పార్లమెంట్‌ లో నిలదీశాం. ఒకవైపు చంద్రబాబు బనకచర్ల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరంలో నీటి సామర్థ్యం తగ్గిపోతే బనకచర్ల, ఉత్తరాంధ్ర సజల స్రవంతికి నీటిని ఎలా అందిస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలి. రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్ట్‌ విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిసారీ తెలుగుదేశం ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారు. వారి వైఖరి వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోంది. 

మెడికల్‌ కాలేజీలకు నిధులు కోరాం:
    రాష్ట్రం నుంచి మెడికల్‌ విద్య కోసం అధిక ఫీజులను చెల్లిస్తూ విదేశాలకు వెళ్ళి విద్యార్ధులు చదువుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 75 వేల కోట్ల మెడికల్‌ సీట్లను తీసుకువస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో వైయస్‌ జగన్‌గారి హయాంలో ప్రారంభించిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేసింది. వాటిని పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. విద్యార్ధుల ప్రయెజనాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీశాం. కేవలం ఆర్థిక సాయమే కాకుండా ఉక్కు కర్మాగారం భవిష్యత్‌ దృష్ట్యా కాప్టివ్‌ మైన్స్‌ ఇవ్వాలని కోరాం.
    విశాఖపట్నం రైల్వేజోన్‌ కోసం గత అయిదేళ్ళలో సీఎంగా వైయస్‌ జగన్‌గారి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్రాన్ని పలుమార్లు కలిసింది. ఇప్పుడు రైల్వేజోన్‌ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. వాల్తేర్‌ డివిజన్‌ పూర్తిగా జోన్‌లో ఉండాలని కోరుకుంటున్నాం. దీనిని విభజించడానికి జీఓ కూడా ఇచ్చారు. దీనిని కూడా అడ్డుకునేందుకు ఉభయ పార్లమెంట్‌ సభల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకనే వరకు పోరాడతాం. 

విభజన హామీలు నెరవేర్చాలి:
    విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశాం. వీటిని గురించి మేం మాట్లాడుతుంటే తెలుగుదేశం ఎంపీలు మాపైన విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. ఢిల్లీకి వచ్చి, పార్లమెంట్‌ లో మాపైన తిట్లవర్షం కురిపించేందుకు తమ సమయాన్ని కేటాయించకుండా రాష్ట్ర సమస్యలపై వినియోగించాలని కూడా వారికి విజప్తి చేస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్రంను ప్రశ్నించడానికి సిద్దమైతే రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం మీతో నిలబడతామని కూడా చెప్పాం. పోలవరం గురించి కేంద్రాన్ని ధైర్యంగా ప్రశ్నించే క్రమంలో మీ వెనుక వస్తామని కూడా చెప్పాం. కానీ తెలుగుదేశం ఎంపీలు ప్రజాసమస్యల కన్నా మాపైన విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. కడప ఉక్కు పరిశ్రమపై విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చి కూడా ముందుకు రాకపోతే ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ గారు జిందాల్‌ సంస్థను ఒప్పించి కడపలో శంకుస్థాపన చేయించారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జిందాల్‌ పై తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు. అదే జిందాల్‌ మహారాష్ట్రకు వెళ్ళి మూడు వేల కోట్లతో పరిశ్రమ పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటిని ఏ అవసరాలకు ఖర్చు చేస్తున్నారో తెలియదు. 

రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం:
    చిన్న రాష్ట్రం అవ్వడం, సంఖ్యాపరంగా తక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల ఏపీ ప్రయోజనాల పట్ల కేంద్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పూర్తిగా మన రాష్ట్రానికి చెందిన ఎంపీల బలంమీదే ఆధారపడి ఉంది. ఈ సందర్బాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు కృషి చేయాలి. ఈ సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయడం తగదు. బీహార్‌కు ఇస్తున్న ప్రాధాన్యతతో చూస్తే ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌ సభల్లో మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వారే దానిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుందని గ్రహించాలి.

రాజకీయ వేదికగా చూడటం దురదృష్టకరం. 
    టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ను కూడా రాజకీయ వేదికగా చూడడం దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్లలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దీనిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ తీవ్రంగా వ్యతిరేకించాలి. దీనికి తెలుగుదేశం ముందుకు వస్తే, వారి వెనుక నిలబడేందుకు మేం సిద్దంగా ఉన్నాం. 11 పథకాలతో రైతులను ఆదుకున్న చరిత్ర వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానిది. దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తుంటే కూడా తెలుగుదేశం ఎంపీలు అడ్డుకున్నారు. అయితే ఈ తరహా విధానాలను ప్రజలు ఎప్పటికీ ఉపేక్షించబోరని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు.

Back to Top