సుప్రీం, హైకోర్టు నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి

రాజ్య‌స‌భ‌లో మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు, హైకోర్టులలో జరిగే జ్యుడిషియల్‌ నియామకాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124, 217కు సవరణ చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించే ప్రకటనకర్తలు, ప్రకటన సంస్థలకు భారీ పెనాల్టీ విధించేందుకు వీలుగా వినియోగదారుల సంరక్షణ బిల్లులోని సెక్షన్‌ 89ను సవరించాలని కోరుతూ మరో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. 

అదే విధంగా విద్యా సంస్థలు-పరిశ్రమల మధ్య అనుసంధానం చేసే ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం ద్వారా విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల పరిజ్ఞానాన్ని పారిశ్రామిక మార్కెట్‌కు తరలించడం సులభతరం చేసే ఉద్దేశంతో ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయం దీని కోసం ఒక ప్రత్యేక అనుసంధాన విభాగాన్ని విధిగా  ఏర్పాటు చేయడానికి  వీలుగా సెంట్రల్‌ యూనివర్శిటీస్‌ చట్టం సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి మూడవ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును రాజ్య‌స‌భ‌లో ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులు ప్రవేశపెట్టడానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Back to Top