తాడేపల్లి: గవర్నర్ ప్రసంగమంతా అబద్ధాలమయం అని, ఒక్క వాస్తవం కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా పథకాల అమలు ప్రస్తావన లేదన్న వారు.. ‘ఆత్మస్తుతి. పరనింద’లా ఆ ప్రసంగం కొనసాగిందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం గవర్నర్ ప్రసంగంలో అదే తేటతెల్లమైందని వెల్లడించారు. ఇంకా 9 నెలల పాలనతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజా సమస్యలపై మా పార్టీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే ధైర్యం లేకనే వైయస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి జంకుతోందని ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగం పట్ల, కోర్టుల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు చెప్పారు. అసెంబ్లీలో ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ పదవి విపక్షానికి ఇవ్వడం సంప్రదాయమని, కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని కూడా కాలరాసిందని చంద్రశేఖర్, విరూపాక్షి గుర్తు చేశారు. అధికారంలో భాగస్వామ్యం వహిస్తున్న జనసేనకు ఆ పదవి ఎలా ఇచ్చారని వారు నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా ఏమన్నారంటే..: అబద్ధాల కుప్ప గవర్నర్ ప్రసంగం: తాటిపర్తి చంద్రశేఖర్. – గవర్నర్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనింద అనేలా ఉంది తప్ప, రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే అంశం ఏ ఒక్కటీ లేదు. హామీల అమలు, ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూనే, 9 నెలల్లోనే రాష్ట్రం అప్పులు రూ. 1.30 లక్షల కోట్లకు దాటించి, తలసరి ఆదాయం 2047 నాటికి రూ.58 లక్షలు చేస్తానని ఇంకా పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించి ప్రణాళిక లేని చంద్రబాబు, 2047 విజన్ గురించి కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. పంటలకు మద్ధతు ధర లేక రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, హామీలు అమలు కాక ఉద్యోగులు, రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు, ఆరోగ్యశ్రీ బిల్లులు రాక ఆస్పత్రుల యాజమాన్యాలు.. ఇలా అన్ని వర్గాలు కూటమి పాలనలో తీవ్రంగా నష్టపోయాయి. గత ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చడం తప్ప, టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. ఆర్బీకేలు పని చేయడం లేదు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఆగిపోయింది. గతంలో ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకపోగా వారు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ అమలు చేయడం లేదు. ఉచిత బస్సు ఊసెత్తడం లేదు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తామని ఇవ్వకుండా వదిలేశారు. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మినహా ప్రజలకు ఈ ప్రభుత్వం చేసింది శూన్యం. ప్రతిపక్ష హోదా గురించి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వచ్చిన ఓట్లను బట్టి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలంటూ హేళనగా మాట్లాడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే, 11 మందిని ఎదుర్కొనే సత్తా ఉంటే వైయస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం?. దళిత ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాడుతున్న నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. నా మెడలో కండువా జారి పడిపోతే దానికి విపరీత అర్థాలు తీస్తున్నారు. దళితులంటే టీడీపీకి అంత చిన్నచూపు దేనికి? మా నాయకులు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటారు. టీడీపీలో దళిత ఎమ్మెల్యేలకు ఆ గౌరవం ఉందా?. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం: బూసినె విరూపాక్షి. – వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని మేం భావిస్తున్నాం. అలవి కాని హామీలిచ్చి నెరవేర్చలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం, ఎక్కడ మేం ప్రశ్నిస్తామన్న భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో చాలా సమస్యలు. వాటన్నింటినీ ప్రస్తావించాల్సి ఉంది. కానీ, ఈ ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వడం లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం లేనప్పుడు, అధికార పక్షం వారి ప్రసంగాలు వినడానికి మేం అసెంబ్లీకి వెళ్లాలా? వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కును కూడా కాలరాస్తోంది. సమస్యలకు సమాధానం చెప్పలేక ఆ విధంగా ప్రజల గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేస్తోంది.