కాలు బాగోలేక వెళ్లకపోయినా రాజకీయాలేనా..?

బుర్రలేని అచ్చెన్నాయుడు బుద్ధిలేని మాటలు

చెప్పుకోవడానికి ఏమీ లేక.. కులాలు, మతాల గురించి టీడీపీ వ్యాఖ్య‌లు

బాలకృష్ణ, లోకేశ్ లు పొలిటికల్ జోకర్లు..

చేసింది చెప్పుకుని ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లగలిగే పార్టీ మాదే

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజ‌య‌వాడ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ కాలు బాగోలేక ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కళ్యాణానికి వెళ్లలేకపోయారని దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజ‌కీయం చేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మరుసటి రోజు కాలు కొంత మెరుగ్గా ఉండటంతో ప్రజల కోసం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి చిలకలూరిపేట వెళ్తే దానిపై కూడా టీడీపీ నేత‌లు రాజకీయం చేస్తున్నారని, చెప్పుకోవ‌డానికి ఏమీ లేక, ఆఖరికి కులాలు, మతాలు గురించి మాట్లాడే స్థాయికి టీడీపీ నేతలు, అచ్చెన్నాయుడు దిగజారిపోయారని మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

మ‌ల్లాది విష్ణు ఇంకా ఏం మాట్లాడారంటే.. 
`లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న బాల‌కృష్ణ నోటికివ‌చ్చిన‌ట్టుగా మాట్లాడుతున్నాడ‌ని, లోకేష్‌, బాల‌కృష్ణ‌  మాటలు వింటే.. పొలిటికల్ జోకర్లలా కనిపిస్తున్నారు. ఏం మాట్లాడతారో తెలియకుండా, కనీస జ్ఞానం లేకుండా,  కేవలం సీఎం వైయ‌స్ జగన్‌ని విమర్శించడమే ప‌నిగా పెట్టుకున్నారు. మీ బావ చంద్రబాబు- ఓటుకు కోట్లు కేసులో, అరెస్టులకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. భయపడిపోయి, ప్రాంతాలు మారేది నువ్వూ, నీ బావ తప్ప సీఎం వైయ‌స్‌ జగన్‌ కాదు. ఒక నిబద్ధత, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌. మేం ఈ రోజు చేస్తున్న పనులు మీ చరిత్రలో ఎందుకు చేయలేకపోయారని ఒకసారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోండి. 

అచ్చెన్న బుద్ధిలేని మాటలు..
``జగనన్నే మా భవిష్యత్తు`` అని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వారి  స్వార్థం కోసం వెళ్లిపోయారు. ఒక టికెట్‌ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు వస్తారని అచ్చెన్నాయుడు మాట్లాడటం బుర్రలేనితనం. పార్టీ లేదు.. బొక్కా లేదని మాట్లాడిన అచ్చెన్నాయుడు- మా ఎమ్మెల్యేలు ఆఫర్స్‌ ఇస్తున్నారని మాట్లాడటం హాస్యాస్పదం. ఎవరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డితిని, నమ్మక ద్రోహం చేసి శానసమండలి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశారు. దాన్ని చూపి ఏపీ ప్రజలంతా తమ వైపు ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అది వాపే అవుతుంది తప్పితే బలం కానేకాదు.  ఎవరో నలుగురు పార్టీకి నమ్మకద్రోహం చేసి మీకు ఓటేస్తే.. వారిని చూసి, ఇక అధికారంలోకి వచ్చేశామని మీరు ఊహల్లో తేలితే.. అది మీ ఖర్మ

ప్ర‌జ‌ల్లోకి ధైర్యంగా వెళ్తున్నాం.. 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పింది నాలుగేళ్ల పాల‌న‌లో అక్ష‌రాల చేసి చూపించింది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇది చేశాం అని ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలిగిన పార్టీ మాది. ఎవరెన్ని కుట్రలు  చేసినా సీఎం వైయ‌స్‌ జగన్‌ని ఢీకొనే పార్టీ ఈ రాష్ట్రంలో లేదు.  మీ తెలుగు తమ్ముళ్లు రోడ్లపై కొట్టుకుంటున్నారు.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ముందుగా అది చూసుకోండి. గుడివాడకు చంద్రబాబు వెళ్లగానే తమ్ముళ్లు పంచాయితీ పెట్టబోతున్నారు. ముందు మీ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోండి.. పులివెందుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2019 జనరల్ ఎన్నికల దగ్గర నుంచి.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రజలు మాకే పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని, కనీసం అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని చేతులెత్తేసింది మీరు కాదా..? ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా జరిగే ఎన్నికలను బహిష్కరించిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తెలుగుదేశం పార్టీనే` అని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. 

Back to Top